
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల సుదర్శన్ తన వ్యవసాయ పొలం వద్ద వేరుశెనగ పంట వేసుకున్నాడు. ఈ క్రమంలో పంటకు నీళ్లు పెట్టేందుకు పైపులు వేసుకొని వాటికి స్పింక్లర్లు అమర్చుకున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే మూడు రోజుల క్రితం పంట వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్ చేసి నీరు పెడదాం అనుకునే సమయానికి ఓ పైప్ లైన్ నుంచ్ బుస్, బుస్ మంటూ శబ్ధం వినిపించింది. దగ్గరికి వెళ్లి అనుమానంగా చూడగా ఆ పైప్ లో నాగుపాము కనిపించింది.
అయితే ఆ నాగుపామును చంపకుండా మానవతా హృదయంతో దాన్ని అందులో నుంచి ప్రాణాలతో బయటకు తీసి వదిలేయాలని భావించాడు సుదర్శన్. కానీ అసలే నాగుపాము.. ఆపై బుసలు కొడుతోంది. పైపులో ఉన్న నాగుపాము కాటేస్తే ప్రమాదమని భావించి వనపర్తి జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సోసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. అయితే ఆయన వచ్చేలోపు పైప్‌లో ఊపిరి ఆడకపోవడంతో ఈ పాము స్పృహ కోల్పోయి అందులోనే చిక్కుకుంది.
ఇక స్నేక్ క్యాచర్ వచ్చాక పైపులో నుంచి నాగుపామును బయటకు తీశారు. పాము నిజంగానే చనిపోయిందని అనుకున్నారు. కృష్ణ సాగర్ మాత్రం సీపీఆర్ చేస్తే బ్రతికే అవకాశముందని ప్రయత్నించాడు. నెమ్మదిగా నాగుపాముకు సీపీఆర్ చేసి.. కొన్ని నీళ్లు పోశాడు. కాసేపటికే నాగుపాము స్పృహలోకి వచ్చింది. చనిపోయిందనుకున్న సరీసృపం బ్రతకడంతో అందరి కళ్లలో ఆనందం వెళ్లివిరిసింది. అక్కడి నుంచి పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు కృష్ణ సాగర్. ఈ తతంగాన్నం వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ వీడియో స్థానిక వాట్సప్ గ్రూప్ ల్లో తెగ వైరల్ అవుతోంది.
పాములు ప్రమాదకరం అని వాటిని వెంటాడి వెటాడి చంపే ఈ రోజుల్లో చనిపోయిందనుకున్న పామును సీపీఆర్ చేసి కాపాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని అకారణంగా ఏ ప్రాణిని చంపవద్దని అక్కడ ఉన్నవారికి చెప్పి వెళ్లిపోయారు కృష్ణ సాగర్.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

