ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సంస్మరణ దినం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సంస్మరణ దినం సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థం కొన్నిచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉచిత భోజనాలు ఏర్పాటు చేయగా.. జనం భారీగా తరలివచ్చారు. ఈ వీడియోను మంత్రి నిమ్మల రామానాయుడు షేర్ చేశారు.

పాలకొల్లులోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద దాతల సహకారంతో అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనాలు అందిస్తున్నారు. రోజుకో దాత విరాళాలు అందించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన వీడియోలను మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బైక్ మీద వస్తూ రాజమండ్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించింది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. దీనిని రోడ్డు ప్రమాదంగా నిర్ధారించారు. సాంకేతికత సాయంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలించారు. అలాగే ఫోన్ కాల్స్ డేటా. కుటుంబసభ్యుల విచారణ చేపట్టారు. యూపీఐ పేమెంట్స్ సహా అన్ని అంశాలను పరిశీలించిన పోలీసులు.. మద్యం మత్తులో డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదం జరిగి ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన చనిపోయినట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అయితే సంస్మరణ దినం సందర్భంగా ప్రస్తుతం ఈ అంశం మల్లీ తెరపైకి వచ్చింది.


