International
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగు వారాలుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓవైపు యుద్ధాన్ని ముగించేందుకు సంధి చర్చలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. దాంతో ఇరాన్- అమెరికా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇరాన్- అమెరికా యుద్ధంపై భారత మాజీ మేజర్ జనరల్ జీడీ భక్షీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ మాస్టర్ ప్లాన్ కు అమెరికా పీకల్లోతు చిక్కుల్లో పడిపోయిందని జీడీ భక్షీ అన్నారు. యుద్దం ప్రారంభంలో సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయి కాస్త తడబడ్డ ఇరాన్.. ఇప్పుడు సరైన ప్రణాళికలు రచిస్తూ అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలిపారు. అమెరికా 15 పాయింట్ల ప్రణాళికను తాజాగా ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో జీడీ భక్షీ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హార్మూజ్ జలసంధి ఇంకా మూసివేసే ఉందని.. దాని వల్ల ప్రపంచ దేశాలు సంక్షోభంలోనే ఉన్నాయని తెలిపారు.
అమెరికా ప్రస్తుతం ఓ వ్యూహం అంటూ లేని అనవసర యుద్ధంలో చిక్కుకుపోయిందని అన్నారు. ఇటీవల ట్రంప్ ఐదు రోజుల పాటు ఇరాన్ పై కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే కేవలం వంచన మాత్రమేనని జీడీ భక్షీ అంచనా వేశారు. ఈ గ్యాప్ లో సైన్యాన్ని మోహరించుకుని మళ్లీ దాడులు చేస్తుందని ఇదే అమెరికా నైజం అని పేర్కొన్నారు. అందువల్లనే అమెరికా సంధి చర్చలను ఇరాన్ తిరస్కరిస్తోందని తెలిపారు.
ఇక ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన ఎఫ్-35, ఎఫ్-15 ఫైటర్ జెట్స్ ను ఇరాన్ పేల్చేసినట్లు కథనాలు వచ్చాయని భక్షీ పేర్కొన్నారు. అలాగే యూఎస్ఎస్ అబ్రహాం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ లాంటి భారీ యుద్ధ నౌకలు ఇరాన్ దాడిలో దెబ్బతిన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోందని అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా భారత్, జపాన్, పాకిస్థాన్, చైనాలకు చెందిన నౌకలకు అనుమతి ఇస్తూ అమెరికాను ప్రపంచ దేశాల నుంచి ఒంటరిగా చేస్తోందని జీడీ భక్షీ అభిప్రాయపడ్డారు.
ఇరాన్ వద్ద 6 లక్షల సైన్యం, 2 లక్షల రెవెల్యూషనరీ గార్డ్స్ తో పటిష్టంగా ఉందని.. ఇరాన్ ను ఓడించడం అమెరికా వల్ల కాదని భక్షీ తేల్చారు. ఇరాన్.. ప్రస్తుతం తన క్షిపణి వ్యవస్థలను భూగర్భ సొరంగాల్లో అత్యంత సురక్షితంగా ఉంచిందన్నారు. వాటిని అమెరికా.. బాంబులతో నాశనం చేయడం అసాధ్యమని భక్షి తెలిపారు.

హార్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ఇరాన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తోందని అన్నారు. ఒకవేళ అమెరికా.. డైరెక్ట్ గా ఇరాన్ పై యుద్ధానికి దిగితే అప్పుడు ముడి చమురు ధర బ్యారెల్ కు 200 డాలర్ల వరకు చేరుతుందని భక్షి హెచ్చరించారు. అమెరికా ఇప్పటికైనా తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే చర్చలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు.

