Andhra Pradesh
oi-Sai Chaitanya
శ్రీరామ నవమి వేళ తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు వరుస సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కాగా, శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు పుణ్యస్నానం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయం లోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక వేదికపై దేవేరులు ఆశీనులయ్యారు.
కాగా, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చెశారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.

ఏప్రిల్ 1న సీతారామ కల్యాణ వేడుక
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో శుక్రవారం తలంబ్రాల ప్యాకింగ్‌ను టీటీడీ శాస్త్రోక్తంగా ప్రారంభించింది. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. శ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు మార్చి 25న పుసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి 1.60 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.

