International
oi-Syed Ahmed
అమెరికాలో గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హెచ్1బీ వీసాదారులపై (H-1B visa) ఉరుముతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు హెచ్1బీ వీసాదారుల వేతనాలపై కార్మికశాఖ కీలక ప్రతిపాదన చేసింది. దీన్ని ప్రభుత్వం ఆమోదిస్తే హెచ్1వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారి కనీస వేతనాలు పెరగబోతున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.
హెచ్1బీతో పాటు ఈ వీసాదారుల వేతనాల పెంపు (H-1B)
అమెరికాలోని విదేశీ కార్మికులకు ప్రామాణిక వేతన ప్రమాణాలను పెంచడానికి కార్మిక శాఖ ఒక కొత్త సంస్కరణను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా హెచ్‑1B, హెచ్‑1B1, ఈ‑3, PERM కార్యక్రమాల కింద యజమానులు కార్మికులకు చట్టబద్ధంగా అందించాల్సిన కనీస జీతాన్ని పెంచాలని ప్రతిపాదించింది. అమెరికాలో విదేశీ జాతీయుల తాత్కాలిక, శాశ్వత ఉపాధి కోసం వేతన రక్షణలను మెరుగుపరచడం పేరుతో ఓ పేపర్ రిలీజ్ చేస్తారు. దీనిపై 60 రోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకుని, దాని ఆధారంగా తుది రూల్స్ నిర్ణయించి అమలు చేస్తారు.

కార్మికశాఖ ప్రతిపాదనలు
ఈ ప్రతిపాదిత చట్టం, విదేశీ జాతీయుల ఉపాధి వల్ల అదే తరహా ఉద్యోగాలు చేస్తున్న అమెరికా కార్మికుల వేతనాల, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తుంది. ఈ కనీస వేతనాన్ని నిర్దేశించడం ద్వారా, కార్మిక శాఖ మార్కెట్ ప్రమాణాలను కొనసాగిస్తూనే, సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ ప్రతిభావంతులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. విదేశీ జాతీయ కార్మికులకు స్పాన్సర్‌షిప్ ఇచ్చేటప్పుడు యజమానులు తప్పనిసరిగా పాటించాల్సిన నాలుగు-అంచెల ప్రస్తుత వేతన నిర్మాణాన్ని సవరించాలని కార్మిక శాఖ ప్రతిపాదిస్తోంది. విదేశీ కార్మికులను తక్కువ వేతనానికి నియమించుకోవడాన్ని నివారించడంతో పాటు 20 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ప్రస్తుత వేతన స్థాయిలను అప్ డేట్ చేస్తారు.

వేతనాల పెంపు ఇలా
తాజా మార్పుల వల్ల ప్రతి లెవెల్ కు సగటున వేతనం సంవత్సరానికి సుమారుగా $14,000 పెరుగుతుందని అంచనా. ఎంట్రీ లెవెల్ లో ప్రస్తుతం 17 పర్సంటైల్ గా ఉన్న వేతనం 34 పర్సెంటైల్ కు, క్వాలిఫైడ్ లెవెల్లో 34 పర్సంటైల్ గా ఉన్న వేతనం 52 పర్సంటైల్ కు, ఎక్సీపీరియన్సెడ్ లెవెల్లో 50 పర్సెంటైల్ గా ఉన్న వేతనం 70 పర్సెంటైల్ కు, ఫుల్లీ కాంపిటెంట్ లెవెల్లో ఉన్న 67 పర్సంటైల్ వేతనం 88 పర్సంటైల్ కు చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. దీంతో హెచ్1బీ, హెచ్1బీ1, ఈ-3, పెర్మ్ వీసా కేటగిరీలకు ప్రయోజనం లభిస్తుంది.

