Andhra Pradesh
oi-Sai Chaitanya
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ కొరత వేళ రిలీఫ్ ఇచ్చేలా కార్యాచరణ అమలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తుల పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీని ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఈ రోజు సాయంత్రం సమావేశం అవుతున్నారు. గ్యాస్ సరఫరా తో పాటుగా ధరల పైన పన్నుల అంశం పైనా చర్చించే ఛాన్స్ ఉంది. ఇక.. గ్యాస్ సరఫరా లేక హోటల్స్ మూతబడుతున్న వేళ కేంద్ర తాజా నిర్ణయం ఉపశమనంగా మారనుంది.
వంట గ్యాస్ సరఫరా మెరుగుదల కోసం కేంద్రం వరుస చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాల అవసరాలు తీర్చేలా రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను మరో 20 శాతం కేంద్రం పెంచింది. ఈ నిర్ణయంతో మొత్తం కమర్షియల్ ఎల్‌పీజీ కేటాయింపులు 70 శాతానికి చేరుకున్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పెట్రోలియం శాఖ లేఖ రాసింది. రాష్ట్రాలకు ప్రస్తుతం 50 శాతంగా ఉన్న కమర్షియల్ ఎల్పీజీ కోటాను మరో 20 శాతం కేంద్రం పెంచింది. అందులో భాగంగా ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు కేటాయించిన 40 శాతాన్ని మరో 10 శాతం పెంచింది. కాగా.. అనేక రంగాలు వంట గ్యాస్ కొరత కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హోటళ్ల పరిశ్రమ దెబ్బ తింది.

కేంద్రం తాజా నిర్ణయంతో
కాగా, ఇంటికి సరఫరా చేసే గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెబుతున్నా.. పలు ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా సమస్యగా మారుతోంది. బుకింగ్ కోసం ఆయిల్ కంపెనీలు కొత్త గడువు నిర్దేశించాయి. సరఫరాలో మాత్రం జాప్యం చేస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోతుంది. గ్యాస్ ఎజెన్సీల వద్దకు సిలిండర్లతో వెళ్తున్నారు. గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు విషయంలో కంపెనీలు సాఫ్ట్ వేర్ లోనూ మార్పులు చేసాయి. బీపీసీఎల్, హెచ్ఫీసీఎల్ పంపిణీలో కొంత వరకు మెరుగ్గా ఉన్నా.. ఇండియాన్ ఆయిల్ కార్పోరేషన్ వంట గ్యాస్ సరఫరాలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో హోటల్ పరిశ్రమ పలు ప్రాంతాల్లో నిలిచి పోయింది. తమకు గ్యాస్ సరఫరా పెంచాలని హోటల్ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక, ఇప్పుడు కేంద్రం కమర్షియల్ ఉత్పత్తి పెంచటంతో.. కొంత మేర ఉపశమనం దక్కే అవకాశం కనిపిస్తోంది.

