
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని తాజ్ నగరంలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ హత్య కేసులో పోలీసులు ఒక కీలకమైన పురోగతిని సాధించారు. బాలిక అపహరణ, హత్య కేసులో రూ. 25,000 రివార్డు ఉన్న నిందితుడు, పరారీలో ఉండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బమ్రౌలి కటారా ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తుండగా, నిందితుడు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు.
తాజ్‌గంజ్‌లోని గోబర్ చౌకీ నివాసి అయిన దినేష్ కుమార్, మార్చి 24న తన కుమార్తె కనిపించటంలేదంటూ పోలీసులను అశ్రయించాడు. ఇంటి బయట ఆడుకోవడానికి అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. మార్చి 25న, పోలీసులు క్షుణ్ణంగా గాలించిన సందర్భంగా, అదే ఇంటి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సునీల్ గదిలో ప్రజ్ఞ మృతదేహం లభ్యమైంది. నిందితుడు ఆ అమాయక బాలికను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఒక పిండి డ్రమ్ములో దాచిపెట్టాడు. ఈ ఘటన తర్వాత, ఆగ్రా అంతటా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫతేహాబాద్ రోడ్డుపై భారీ హింస చెలరేగింది.
మార్చి 27-28 రాత్రి, అందిన సమాచారం మేరకు పోలీసులు బమ్రౌలి కటారా ప్రాంతాన్ని ముట్టడించారు. తాను చిక్కుకుపోయానని గ్రహించిన నిందితుడు సునీల్, లైసెన్స్, నెంబర్ ప్లేట్ లేని స్ప్లెండర్ మోటార్ సైకిల్‌పై పారిపోవడానికి ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసు బృందంపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు హత్యాయత్నంతో పోలీసులపై కాల్పులు జరపడంతో ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) గాయపడ్డారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో సునీల్ గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు నంబరు లేని ఒక స్ప్లెండర్ మోటార్‌సైకిల్, ఒక 315 బోర్ పిస్టల్, తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
చిన్నారి దారుణమైన హత్య యావత్ ఆగ్రా నగరాన్ని ఆగ్రహానికి గురిచేసింది. పోలీసులు మొదట్లో ఈ కేసును తీవ్రంగా నిర్లక్ష్యం చేయడంతో బాలిక ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపించారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత, నిందితుడి కోసం గాలింపు చేపట్టేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. 48 గంటల్లోపే ప్రధాన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

