ఊరి సమస్యల పరిష్కారం కోసం ఓ అంధుడు తనకు ఉన్న 15 సెంట్ల భూమిని దానంగా ఇచ్చిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం నందిగరువు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలరాజుకు పుట్టుకతోనే కంటి చూపు లేదు. అయినప్పటికీ ఊరి సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ క్రమంలోనే తమ ఊరిలో బడి, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాపు నిర్మాణం కోసం తనకు ఉన్న 14 సెంట్లను దానంగా అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని అభినందించి.. ఆయా నిర్మాణాలకు అతని పేరే పెట్టాలని ఆదేశించారు.

భూమి మీద ఉన్న దేన్ని అయినా కరెన్సీతో విలువ కట్టే పరిస్థితి ఇది. సమాజానికి నువ్వేం ఇస్తావ్ అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. ఈ ప్రపంచం నాకేమిస్తుంది అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనంటూ ఓ పెద్దమనిషి చెప్పిన విధంగా కరెన్నీ నోటు మానవ సంబంధాలను డిసైడ్ చేస్తున్న ఈ కాలంలో.. పుట్టుకతోనే చూపులేని ఓ వ్యక్తి.. తన ఊరి కోసం, తన ఊరి ప్రజల కోసం, వారి కష్టాలను తీర్చడం కోసం తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలాన్ని నిస్వార్థంగా, దానంగా ఇచ్చేసిన వైనం అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రపంచాన్ని చూడలేకపోయినా, తన ఊరి జనం బాధలు విన్న అతను.. వాటి పరిష్కారానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నందిగరువుకు చెందిన బాలరాజు అనే వ్యక్తికి పుట్టుకతోనే చూపు లేదు. చూపులేనప్పటికీ తమ ఊరిలోని సమస్యల గురించి అతనికి అవగాహన ఉంది. ఊర్లో పిల్లలు చదువుకునేందుకు బడి లేకపోవటం, పసి పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం లేకపోవటం గురించి ఊర్లో జనం చర్చించుకుంటూ ఉంటే విని తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలని భావిస్తున్న బాలరాజుకు.. ఇటీవలే మంచి అవకాశం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ గ్రామానికి వస్తున్నారని బాలరాజు చెవినపడింది. పవన్ కళ్యాణ్‌కు తమ సమస్యలు తెలియజేసేందుకు ఊరి ప్రజలంతా గ్రామ చావడిలో సమావేశమయ్యారు.
ఈ సమయంలోనే బాలరాజు ముందుకొచ్చి ఊర్లో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాఫు భవనాల నిర్మాణానిక తన స్థలాన్ని దానంగా ఇస్తానని ప్రకటించారు. తనకున్న 15 సెంట్ల భూమిని వీటిని కట్టేందుకు దానమిస్తున్నట్లు బాలరాజు ప్రకటించారు. బాలరాజు తీసుకున్న నిర్ణయంపై స్థానికులు అతన్ని అభినందించారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ చేరటంతో.. ఆయా భవనాలను బాలరాజు పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాపు నిర్మాణానికి కావాల్సిన నిధులు, పాలనా అనుమతులు మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.


