భక్తుల రద్దీ పెరగటంతో రోడ్డుపై కార్లు, బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీనితో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తీకమాసంలో వచ్చే చివరి సోమవారం కావటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ముఖద్వారం నుంచి శ్రీశైలం వెళ్లడానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టింది. ఇక శ్రీశైలం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పా్ట్లు చేశారు. శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు.
మరోవైపు కార్తీక మాసం కావటంతో వేకువజామునుంచే మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసం కావటంతో భక్తులు దీపారాధన చేసేందుకు శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక కార్తీక మాసం ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్మపథంలో నిర్వహించిన నిత్యకళారాధన ఆకట్టుకుంది. అలాగే తిరుపతికి చెందిన సహస్ర అకాడమీ బృందం నిర్వహించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఆకట్టుకుంది. శివస్తుతి సహా అనేక శైవగీతాలకు కళాకారులు నృత్యప్రదర్శన నిర్వహించారు.