Delhi Election News: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాల మద్దతు సమకూర్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలైన సమాజ్‌వాదీ (SP), తృణమూల్ కాంగ్రెస్ (TMC), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) శరద్ పవార్ వర్గం సహా మరికొన్ని ఇండి కూటమి (I.N.D.I.A) పార్టీలు కాంగ్రెస్‌ను కాదని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు ముస్లిం ఓటర్లలో పట్టున్న ‘ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్’ (AIUDF) అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ కూడా కాంగ్రెస్‌ను కాదని ఆప్ వైపు నిలిచారు. లౌకికవాదుల ఓట్లు చీలకుండా చూడాలని, ఈ క్రమంలో ముస్లిం ఓటర్లంతా కేజ్రీవాల్‌కే ఓటేసి గెలిపించాలని అజ్మల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే మిత్రపక్షాల్లో ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్‌ను కాదని ఆప్‌కు మద్దతు ప్రకటిస్తుండగా.. మైనారిటీ ఓట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అజ్మల్ ప్రకటన మరొక శరాఘాతంగా మారింది. దేశంలో పరిస్థితులు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో సెక్యులర్ ఓట్లను విభజించవద్దని అజ్మల్ వారించారు.
ద్విముఖ పోరుగా మార్చే వ్యూహం!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల్లో భారతీయ జనతా పార్టీ (BJP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ (INC) కూడా ఉంది. పూర్తిగా పట్టణ ప్రాంత ఓటర్లు ఢిల్లీలో ఒకప్పుడు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతుతో దేశవ్యాప్తంగా కొంత పుంజుకున్న కాంగ్రెస్.. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా గెలుపొంది, తన పూర్వవైభవాన్ని చాటుకోవాలని తహతహలాడింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బరిలోకి దిగి గెలుపు కోసం శ్రమిస్తోంది. కాంగ్రెస్ ప్రయత్నాలతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముక్కోణపు పోటీగా మారాయి. ముస్లిం మైనారిటీలు, దళిత వర్గాల్లో పట్టున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ వర్గాలు ఎక్కువ సంఖ్యలో నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఇది పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. ముస్లిం మైనారిటీ, దళిత ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చితే.. మిగతా ఓట్లలో మెజారిటీ ఓట్లను బీజేపీ కైవసం చేసుకోవడం సులభతరమవుతుంది. ఒకవేళ ఈ వర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీ వెంట నిలిస్తే.. బీజేపీ గెలుపు కష్టతరమవుతుంది. ఈ పరిస్థితిని గ్రహించిన ఇండి-కూటమి పార్టీలు.. కాంగ్రెస్ ప్రయత్నాలను బహిరంగంగా విమర్శించకపోయినా.. తమ మద్దతు కేజ్రీవాల్‌కు ప్రకటించి ముక్కోణపు పోటీని కాస్తా ద్విముఖ పోరుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా ఆప్ విజయావకాశాలను దెబ్బతీయకుండా కాపాడాలని చూస్తున్నాయి. అస్సాం నేత బద్రుద్దీన్ అజ్మల్ ప్రకటన ఈ కోవలోనిదేనని అర్థమవుతోంది.
ముస్లిం ఇలాఖాలో మజ్లిస్ పార్టీ
ముస్లిం సమాజంలో పాపులారిటీ ఉన్న ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టి తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించారు. వారిలో సీఏఏ వ్యతిరేక అల్లర్ల కేసు నిందితుడు షిఫా ఉర్ రెహమాన్‌ను ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఓఖ్లా నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. పౌరసత్వ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన షహీన్‌బాగ్ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో నివసిస్తోంది. మరోవైపు నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ముస్తాఫాబాద్ నుంచి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు ఎంఐఎం టికెట్ ఇచ్చింది. ఢిల్లీ అల్లర్ల కేసులో తాహిర్ హుస్సేన్ నిందితుడు. ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో జైల్లో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వీలుకల్పిస్తూ.. కోర్టు 12 గంటల కస్టడీ పేరోల్ మంజూరుచేసింది. జైల్లో ఉన్న షిఫా ఉర్ రెహమాన్ తరఫున ఆయన భార్య నూరీన్ ఫాతిమా ప్రచారం చేస్తుండగా.. తాహిర్ హుస్సేన్ తరఫున షమా అంజుమ్ కూడా ప్రచారం చేస్తోంది.
తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అసదుద్దీన్ ఓవైసీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన సహజశైలిలో రెచ్చగొట్టే ప్రసంగాలతో ముస్లిం ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జైల్లో ఉన్న నేతల తరఫున ఆడవాళ్లు చేస్తున్న ప్రచారం సెంటిమెంటును రాజేస్తోంది. మొత్తంగా ఈ రెండు ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ప్రచారంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ఈ AIMIM పోటీలో ఉన్నచోట ఆ పార్టీకి, లేనిచోట ఆమ్ ఆద్మీ పార్టీకి అన్న చందంగా ముస్లిం ఓటర్ల మనోగతం మారిందని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో గెలుపు ఎలాగూ సాధ్యం కాదని గ్రహించిందో.. మరే కారణమో.. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరు తగ్గించింది. తద్వారా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ పరిస్థితిని నివారించి బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా అర్థమవుతోంది.
ఢిల్లీలో ఎస్పీ, టీఎంసీ ప్రచారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్ధతు ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అర్వింద్ కేజ్రీవాల్‌తో కలిసి జనవరి 30న ఢిల్లీలో ఉమ్మడి రోడ్‌షో నిర్వహించనున్నారు రితాల నియోజకవర్గంలో వారి రోడ్ షో జరుగుతుందని తెలుస్తోంది. ఎస్పీకి చెందిన పలువురు ఎంపీలు కూడా ఆప్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శతృఘ్న సిన్హా ఢిల్లీలో ఆప్‌కు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జనవరి 31న శతృఘ్న సిన్హా ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి.
కాగా ఢిల్లీ అసెంబ్లీని 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికల నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2020 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో 62లో ఆప్ గెలుపొందగా.. 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.