Vinukonda Guntur National Highway 544D Four Line: ఏపీలో మరో నేషనల్ హైవే విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. గుంటూరు-వినుకొండ జాతీయ రహదారిని త్వరలో నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. భూసేకరణ కోసం సర్వే పనులు ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ ఇటీవల రెవెన్యూ సిబ్బందికి చెప్పారు. వచ్చేవారంలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిని త్వరగా చేరుకునేలా ప్లాన్ చేశారు. రాయలసీమ ప్రాంతం నుంచి అమరావతికి త్వరగా వెళ్లొచ్చు.
హైలైట్:
- ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం
- అమరావతికి కనెక్టవిటీని పెంచేలా ప్లానింగ్
- ఈ హైవే అంచనా వ్యయం రూ.2,605 కోట్లు

ఈ హైవే అంచనా వ్యయం రూ.2,605 కోట్లు కాగా.. 186.24 హెక్టార్ల భూమి అవసరం. ఈ రోడ్డు మొత్తం దరం 85.300 కిలో మీటర్లు. నాలుగు మండలాలు, 29 గ్రామాలు మీదుగా నాలుగు బైపాస్‌లు వస్తాయి. బైపాస్‌లకు 119.11 హెక్టార్లు భూమి అవసరం. వినుకొండ-శావల్యాపురం బైపాస్ దూరం: 17.980 కి.మీ, పెట్లూరివారిపాలెం బైపాస్ దూరం: 2.544కి.మీ, జొన్నలగడ్డ బైపాస్ దూరం: 2.270 కి.మీ, సాతులూరు బైపాస్ దూరం: 3.674 కి.మీ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీ గుంటూరు-వినుకొండ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే అనంతపురం వైపు నుంచి వచ్చేవారు, పల్నాడు జిల్లాకు చెందిన వారు అమరావతికి త్వరగా చేరుకోవచ్చు.
ప్రస్తుతం జాతీయరహదారి-544డిలో అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా బుగ్గ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు మధ్య 135 కిలో మీటర్లు.. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి గుంటూరు మధ్య 84.80 కిలో మీటర్ల హైవేకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. రెండు కీలక ప్యాకేజీలుగా హైవే పనులు చేస్తున్నారు. ఈ హైవే నిర్మాణానికి మొత్తం రూ.5,417 కోట్లు ఎన్‌హెచ్‌ఏఐ కేటాయిస్తోంది.