పాత మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురుని అరెస్ట్ చేసిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు.సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులుఅరెస్టు చేశారు. సుమారు 4,000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే…?
రామగుండం కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో కొందరు అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారు. అనుమానితుల కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు వారిపై ఓ కన్నెసి ఉంచారు. సైబర్ నేరాలకు పాల్పడేందుకు పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరలో సేకరించేందుకు స్క్రాప్ కొనుగోలు దారుల వేషంలో సంచరించారు. అయితే వీరు స్క్రాప్ రూపంలో కొన్న ప్లాస్టిక్, ఇనుప వస్తువులను మాత్రం ఎగుమతి చేస్తూ.. సెల్ ఫోన్లను మాత్రం తమ వద్ద భద్రపర్చుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూర్ ఎస్ హెచ్ ఓ కృష్ణమూర్తి టీం ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. వీరి జార్ఖండ్, జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ క్రిమినల్స్ కు సరఫరా చేస్తున్నారు. పట్టుబడినవారిని మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలాం, మహ్మద్ ఇఫ్తికార్ గా గుర్తించారు. వీరంతా బీహార్ లోని హతియా దియారా నివాసితులు. వారి వద్ద నుంచి సుమారు 4 వేల పాత మొబైల్ ఫోన్లు ఉన్న మూడు గోనె సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో నెల రోజుల నుంచి పాత ఫోన్లను కొనుగోలు చేస్తోంది ఈ ముఠా. నిందితులు ప్రజల నుంచి తక్కువ ధరకు పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మొబైల్ ఫోన్లను బీహార్‌లోని తమ గ్రామంలో నివసిస్తున్న తమ సహచరుడికి అప్పగిస్తారని విచారణలో వెల్లడైంది. అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ మోసగాళ్లకు ఈ మొబైల్ ఫోన్లు సరఫరా అవుతాయి.
సైబర్ మోసగాళ్లకు విక్రయించే ముందు వారి సహచరుడు అక్తర్ మొబైల్ ఫోన్ల సాఫ్ట్‌వేర్, మదర్ బోర్డు, ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చేస్తాడు. ఈ సైబర్ మోసగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడి మోసపూరితంగా సంపాదించిన డబ్బును అక్తర్‌తోపాటు ఇతర నిందితులు పంచుకుంటారు. రామగుండం టీజీసీఎస్బీలోని సీసీపీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆపరేషన్ జముత్రా…
ఫ్రాడ్ కాల్స్ చేస్తూ నేరాలకు పాల్పడే విధానానికి ఆపరేషన్ జముత్రా అని పిలుస్తుంటారని తెలుస్తోంది. జముత్రా పేరిట సైబర్ నేరగాళ్లు దేశంలోని వివిధ ప్రాంతంలోని బాధితుల నుండి డబ్బులు గుంజుతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దేశంలో లోకేషన్స్ మార్చడం, రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు పొరుగు రాష్ట్రానికి వెళ్లి నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీమ్ సరికొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్టయింది. పాత ఫోన్లను స్క్రాప్ పేరిట కొనుగోలు చేసి సైబర్ నేరాలకు పాల్పుడుతున్న విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దేశంలోనే రామగుండం సైబర్ వింగ్ పోలీసులు ట్రేస్ చేసిన ఈ ముఠా అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా చెప్పవచ్చు.
తస్మాత్ జాగ్రత్త..!
ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని, డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అమ్మినా వారు కూడా నేరస్తులుగా పరిగణించాల్స ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..