ఓరుగల్లు పేరు మరోమారు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు వ్యవసాయ ఉత్పత్తులు జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఓరుగల్లు చిల్లీ..వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీలు GI కోసం దరఖాస్తు చేశాయి. ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉండటం వల్ల GI గుర్తింపు లభించిందని.. కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధ్రువీకరణ పత్రం అందిందని ఆయన వెల్లడించారు. వరంగల్ చపాటా మిర్చికి GI గుర్తింపు లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ చపాటా మిర్చికి వైవిధ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మిరపకాయలు లావుగా, ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి టమాటా ఆకారంలో ఉండటం వల్ల వీటిని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తారట. ఈ మిర్చి తక్కువ ఘాటుతో రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు. చపాటా మిర్చి పొడిని పచ్చళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మిఠాయిలు, ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమల్లో కూడా ఈ మిర్చిని రంగు కోసం వాడుతారు.
ఇవి కూడా చదవండి
రెండేళ్ళ క్రితం ఈ చపాట మిర్చి లక్ష రూపాయలకు క్వింటా ధర పలికింది. వరంగల్ జిల్లాలో ప్రత్యేకింఇ చపాట, దేశవాళీ, టమాట, లబ్బకాయ, నగరం మిర్చి అనే పేర్లతో ఉన్న రకాలు ఎక్కువగా పండిస్తున్నారు రైతులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..