ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయి కారణంగా పెందుర్తిలో కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు పవన్ కళ్యాణ్ కాన్వాయి కోసం ట్రాఫిక్ ఆపడంతో.. పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయారని వీడియోలు వచ్చాయి. ఈ వీడియోలలో విద్యార్థులు మీడియా ఎదుట తమ బాధను వెళ్లగక్కారు. అయితే అసలు ఏం జరిగిందనే దానిపై, విశాఖపట్నం పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

దీంతో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన సుమారు 30 విద్యార్థులు.. సరైన సమయానికి కేంద్రానికి చేరుకోలేకపోయారని వార్తలు వచ్చాయి. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం కాగా.. రెండు నిమిషాలు ఆలస్యంగా 8.32కి వీరంతా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. దీంతో సిబ్బంది వారిని పరీక్షకు అనుమతించలేదు. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే సమయానికల్లా ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చే వాళ్లమని విద్యార్థులు మీడియాతో వాపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయమై ఆందోళన చేపట్టారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే విశాఖపట్నం పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.
పవన్ కాన్వాయి వల్లనే పరీక్ష పోయిందా..? లాజిక్‌తో కొట్టిన విశాఖ పోలీసులు
పరీక్షల అడ్మిట్ కార్డ్ ప్రకారం, ప్రతీ అభ్యర్థి ఉదయం 7:00 గంటలకు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని విశాఖ పోలీసులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రం గేట్ ఉదయం 8:30 గంటలకు మూసివేస్తారన్నారు. అయితే డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 గంటలకు సదరు జంక్షన్ గుండా వెళ్ళిందని విశాఖ పోలీసులు వివరించారు. ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా డిప్యూటీ సీఎం కాన్వాయి వెళ్తే.. ఉదయం ఏడు గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎలాంటి సంబంధం లేదని అర్థమవుతోందన్నారు. అంతేకాకుండా, ఏప్రిల్ రెండో తేదీన ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి పరీక్ష రోజున.. మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే ఎగ్జామ్ సెంటర్లో 81, 65, 76 , 61 మంది గైర్హాజరయ్యారని, వీరిలో ఆలస్యంగా వచ్చినవారు కూడా ఉన్నారని వివరించారు. ఆ సంఖ్య సోమవారం తక్కువగా ఉందని వివరించారు.

అలాగే పరీక్ష రాసే విద్యార్థులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేలా చూసేందుకు ఉదయం 08:30 గంటల వరకూ బీఆర్టీఎస్ రోడ్డు, గోపాలపట్నం – పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ నిలిపివేయలేదని విశాఖ పోలీసులు ప్రకటనలో స్పష్టం చేశారు.