తన చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న సమ్మర్ క్యాంప్ స్కూల్లో ప్రమాదం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేకపోయానన్నారు పవన్ కల్యాణ్. మరికాసేపట్లో సింగపూర్‌కు బయలుదేరుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు తెలిసిందన్నారు పవన్. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారని పవన్ కల్యాణ్ తెలిపారు. సింగపూర్ హైకమిషనర్ కూడా సమాచారం అందించారన్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా స్పందించిన వారందరికీ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. సింగపూర్ హైకమిషనర్ సమాచారం అందించారు. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదన్నారు పవన్. అకీరా పుట్టినరోజున ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో.. బాబును వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
మంది పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఓ చిన్నారి చనిపోయిందని, తన కుమారుడు మార్క్ శంకర్ తోసహా పలువురు పిల్లలకు గాయాలయ్యాయన్నారు. ఇదిలావుంటే, ఏప్రిల్ 8వ తేదీ (మంగళవారం)ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..