దేశరాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 2 మూతపడింది.. టెర్మినల్ 2…. ఇతర రెండు టెర్మినల్స్ (టీ1, టీ3) తో పోలిస్తే నాణ్యత ప్రమాణాల్లో వెనుకబడి ఉందని ప్రయాణీకుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయ అభివృద్ధిపై దృష్టి పెట్టింది జిఎంఆర్ సంస్థ. ప్రస్తుతం టెర్మినల్-2 ఆధునీకరణ, నిర్మాణ పనుల కారణంగా టెర్మినల్ 2 ఆపరేషన్స్ నిలిపివేశారు అధికారులు. మూడున్నర నెలల పాటు జులై 31 వరకు T2 టెర్మినల్ మూసి ఉండనుంది. ఈ టెర్మినల్‌ను మరింత అధునాతనంగా మార్చేందుకు విస్తృతమైన పునరుద్ధరణ పనులు చేపట్టాలని విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహిస్తున్న సంస్థ జీఎంఆర్ గ్రూపు భావించింది. ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజీ కియోస్క్‌లు, బ్యాగేజీ నిర్వహణ వ్యవస్థలు, సెల్ఫ్-చెక్-ఇన్ సౌకర్యాలు వంటివి ఉన్నాయి. ఈ మార్పుల తర్వాత టెర్మినల్-2ను అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించే టెర్మినల్-3 (T3)కు కొనసాగింపుగా.. లేదా గతంలో మాదిరి డొమెస్టిక్ సేవల కోసం వినియోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిరోజూ T2 నుంచి 270 విమానాలు ఆపరేషన్స్ నిర్వహిస్తాయి..ఇప్పుడు ఇవన్నీ T1 నుంచి సేవలను కొనసాగించనున్నాయి. T1 టెర్మినల్ లో ప్రయాణికుల రద్దీ పెరగకుండా విమాన సర్వీసులకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ విమానాశ్రయంలో మొత్తం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఇందులో టెర్మినల్-1, టెర్మినల్-2 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడుస్తుండగా.. టెర్మినల్-3లో డొమెస్టిక్‌తో పాటు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ మూడు టెర్మినళ్లలో 2, 3 టెర్మినళ్లు ఒకదానికి ఆనుకుని మరొకటి పక్కపక్కనే ఉన్నాయి. రెండింటికీ ప్రత్యేక ఎయిర్పోర్ట్ లైన్ మెట్రో రైల్ సదుపాయం కూడా ఉంది.
దేశంలోనే టాప్ ఎయిర్ పోర్టుగా ఢిల్లీ విమానాశ్రయం
ఢిల్లీ విమానాశ్రయంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా.. వరుసగా ప్రపంచ ర్యాంకింగ్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక హంగులతో ఉండే ఈ విమానాశ్రయంలో సేవల్లో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రయాణికులకు సులభతరమైన చెక్ ఇన్ సేవలు అందించడం వంటివి ఎన్నో ఇక్కడ లభ్యమవుతాయి. చేతిలో ఎలాంటి ధృవపత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండా డిజియాత్ర వంటి టెక్నాలజీతో ప్రయాణికుడి మొబైల్ ఫోన్, ముఖం స్కాన్ చేయడం ద్వారా అతడి గుర్తింపును నిర్ధారించుకుని గేట్లు తెరుచుకునే సదుపాయం కూడా ఇక్కడ ఉంది. అయితే ఇవ్వన్ని T3,T1 టెర్మినల్ వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి
ప్రయాణికులపై ప్రభావం
టీ-2 మూసివేతతో, ఈ టెర్మినల్ నుంచి నడిచే 122 ఇండిగో విమానాలు టెర్మినల్ 1 (టీ1) కి మారనున్నాయి. ఈ మధ్యనే టెర్మినల్-1ను విస్తరించడంతో పాటు మరింత ఆధునీకరించిన విషయం తెలిసిందే. తద్వారా టెర్మినల్-1 నిర్వహణ సామర్థ్యం కూడా పెరిగింది. అంటే టెర్మినల్-2 మూసివేత కారణంగా ఇతర రెండు టెర్మినళ్లపై ఎలాంటి అదనపు భారం ఉండదు. కాకపోతే టెర్మినల్-2 ద్వారా ఇన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మెట్రో రైల్ సదుపాయం ఉండదు. టెర్మినల్-1 ను కూడా మెట్రో రైల్‌కు అనుసంధానం చేస్తున్నప్పటికీ.. మిగతా రెండు టెర్మినళ్ల మాదిరిగా నేరుగా ప్రత్యేక ఎయిర్పోర్ట్ లైన్‌తో కనెక్టివిటీ లేదు. దీంతో ఈ టెర్మినల్‌కు చేరుకోవాలంటే రోడ్డు మార్గంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే టెర్మినల్-1 ఆధునీకరణ తర్వాత ఏటా 40 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. టీ2 నుంచి టీ1 కి విమానాల మార్పు కారణంగా, ప్రయాణీకులు తమ ఎయిర్‌లైన్స్‌తో ముందుగానే సంప్రదించి, విమాన షెడ్యూల్, టెర్మినల్ సమాచారాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే చివరి నిమిషంలో ఉరుకులు పరుగులతో తమ విమానాలను మిస్సయ్యే ప్రమాదం ఉంది.
ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్, బహుళ దశల్లో అభివృద్ధి పనులను చేపడుతోంది. కామన్వెల్త్ గేమ్స్ ముందు టీ-3 నిర్మాణం, 4వ రన్‌వే, భారతదేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ క్రాస్ టాక్సీవే వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. తాజాగా టీ-2 పునరుద్ధరణ ద్వారా విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి హబ్‌గా మార్చే దిశలో ముందడుగు వేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..