రక్తదానం మహాదానం అంటారు. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుంది. అందుకే రక్తదాతలను ప్రాణదాతలుగా పోలుస్తారు. ఇప్పటి వరకు మనం మనుషులు రక్త దానం చేయడం గురించే విన్నాం. కానీ, ఒక మూగ జీవి మరో జంతువు ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం ఎప్పుడైనా చూశారా..? అవును మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఒక కుక్క రక్తదానం చేయడం ద్వారా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మరో కుక్క ప్రాణాలను కాపాడింది. అశోక్ నగర్ నివాసి సోను రఘువంశీకి డైసీ అనే రెండేళ్ల ఆడ లాబ్రడార్ బిచ్ ఉంది. డైసీ దాదాపు 35 రోజుల గర్భవతి.
గత కొన్ని రోజులుగా డైసీకి తీవ్ర రక్తస్రావం అవుతోంది. సోను, అతని కుటుంబ సభ్యులు డైసీని స్థానిక ప్రభుత్వ పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ డైసీని పరీక్షించిన వైద్యులు.. దాని కడుపులో ఉన్న కుక్కపిల్లలన్నీ చనిపోయాయని చెప్పారు. వెంటనే వాటిని తీసివేయాలని అన్నారు. కానీ, అప్పటికే ఆ కుక్క బాగా రక్తాన్ని కోల్పోయింది. ఆడ కుక్కకు రక్తం అవసరమని, రక్తం ఎక్కించకుండా ఆపరేషన్ సాధ్యం కాదని చెప్పారు. లేదంటే ఆ కుక్క బతికే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఆ కుక్కకు 3 యూనిట్ల రక్తం కోసం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పగా, సోను వెంటనే స్థానిక సామాజిక కార్యకర్తలను సంప్రదించాడు. సభ్యుల్లో ఒకరు తమ పెంపుడు కుక్క రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. అలా రక్త మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. చివరికి ఆపదలో ఉన్న లాబ్రడార్ బిచ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ పెంపుడు కుక్క కోలుకుంటున్నట్టుగా వైద్యులు తెలిపారు.
మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరోకరికి ప్రాణదానం చేసిన వారవుతారని అంటున్నారు.