ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వీటితో పాటుగా ఇప్పటికే మొదలైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం అదనంగా 500 ఎకరాల కేటాయించాలనే దానిపై మంత్రుల కమిటీ మంగళవారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమై అదనపు భూకేటాయింపులపై చర్చించింది.

మంగళవారం మంత్రుల కమిటీ సమావేశమై భోగాపురం విమానాశ్రయానికి 500 ఎకరాల భూకేటాయింపులపై చర్చించింది. సచివాలయంలోని ఆర్ధిక శాఖ మంత్రి కార్యాలయంలో పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 500 ఎకరాల అదనపు భూములు కేటాయింపు సంబంధిత అంశాలపై చర్చించారు. ఉత్తరాంధ్ర ఆర్ధిక, సామాజిక, ఉపాధి రంగాల్లో మరింత పురోగమించడానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రబిందువు కానుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు శరవేగంగా జరిగేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రోడ్లు,భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
మరోవైపు విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల పరిశీలించారు. ఎయిర్‌పోర్టు పనులు 71 శాతం పూర్తైనట్లు తెలిపారు. టీడీపీ కూటమి హయాంలో పది నెలల్లో 45 శాతం పనులను పూర్తి చేసినట్లు వివరించారు. వచ్చే ఏడాది జూన్‌లోగా నిర్మాణ పనులను పూర్తి చేసి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విమానాశ్రయంలో ఏర్పాట్లు చేస్తామని కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.