చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఔషదంలా పని చేస్తాయి. ఈ కూరగాయలో ఉండే ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాలు, క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి.
చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి. చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
చిక్కుళ్ళలో ఉండే కాపర్ మెదడు ఆరోగ్యానికి కావాల్సిన డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాల విడుదలకు దోహదం చేస్తాయి. వీటితోపాటు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతాయి. వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
చిక్కుడు కాయలో సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి ఔషదంలా పని చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు.
ఆడవారిలో ఎక్కువగా కనిపించే రక్తలేమి, ఎముకల బలహీనతకు చిక్కుడు మంచిది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం. ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు బాగా తీరుస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. మానసిక ఆందోళనను కూడా తగ్గిస్తాయి.