ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగుపడింది. రాజధానిలో ఐదు భారీ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానిస్తోంది. సచివాలయ టవర్లు, హెచ్‌వోడీ కార్యాలయ టవర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయ నిర్మాణంలో నాలుగు టవర్లు, హెచ్‌వోడీ ఆఫీస్ టవర్ నిర్మాణం కోసం ఈ టెండర్లు పిలిచారు. మొత్తం ఐదు టవర్ల నిర్మాణానికి 4,668 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు మే రెండో తేదీన ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 1, 2 టవర్ల నిర్మాణం కోసం రూ.1,897 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణం కోసం రూ.1,664 కోట్లతో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. అలాగే హెచ్‌వోడీ కార్యాలయం టవర్ నిర్మాణం కోసం రూ. 1,126 కోట్లతో మరో టెండరును పిలిచింది. మొత్తం 5 టవర్లకు రూ. 4,668 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మే ఒకటో తేదీన ఈ టెక్నికల్ బిడ్లను సీఆర్డీఏ అధికారులు తెరవనున్నారు. హెచ్వోడీలకు సంబంధించిన టవర్‌లో మొత్తం 45 అంతస్థులు ఉండనున్నాయి. సచివాలయంలోని మిగతా నాలుగు టవర్లను 40 ఫ్లోర్లతో నిర్మించనున్నారు. ఈ టవర్లన్నీ కూడా డయాగ్రిడ్ స్టక్చర్‌తో నిర్మించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో సచివాలయ టవర్ల నిర్మాణం అత్యంత కీలకం కానుంది. మరోవైపు ఈ టవర్ల నిర్మాణాన్ని రెండున్నర నుంచి మూడేళ్లలో పూర్తి చేయాలని సీఆర్డీఏ స్పష్టం చేసింది.
అమరావతి: రాజధానిలో 5 భారీ టవర్లు.. ఎన్ని రూ. వేలకోట్లంటే?
మరోవైపు అమరావతి నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే జర్మనీకి సంబంధించిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ కూడా రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే ఈ రుణాల నుంచి కేంద్రం ఇటీవల 4200 కోట్ల వరకూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మే నెల రెండో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయం వెనుకవైపున మోదీ సభ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని సభలో అమరావతి త్రీడీ నమూనాను ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.