ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శనివారం కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాలలో మాత్రం తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

”శనివారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మరికొన్ని జిల్లాలలో శనివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Andhra Pradesh Rains: ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వానలు.. ఇక్కడ మాత్రం ఎండలు బాబోయ్ ఎండలు..
శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, పల్నాడు జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. శుక్రవారం నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.7°C ఉష్ణోగ్రత, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. మరోవైపు తీవ్రవడగాలులు వీచే ప్రాంతాల్లో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.