అమెరికాలో F-1 విద్యార్థి వీసాలు రిజెక్ట్ అయిన వారిలో ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువగా ఉన్నారు. 50 శాతానికి పైగా భారతీయ విద్యార్ధుల F-1 విద్యార్థి వీసాలు తిరస్కరణకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని అమెరికాతో చర్చలు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మార్చి నెలలో 1,000 మంది విదేశీ విద్యార్ధుల వీసాలను రిజెక్ట్ చేసింది ట్రంప్ సర్కార్.
అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ వీసా కష్టాలు రెట్టింపయ్యాయి. F-1 విద్యార్థి వీసాలు రిజెక్ట్ అయిన వారిలో 50 శాతానికి పైగా భారతీయ విద్యార్ధులే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. విద్యార్ధులు, యూనివర్సిటీ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను వెల్లడించారు. గత నెలలో 1,000 మంది విదేశీ విద్యార్ధుల వీసాలను తిరస్కరించింది డోనాల్డ్ ట్రంప్ సర్కార్.
భారతీయ విద్యార్ధుల 50 శాతం F-1 విద్యార్థి వీసాలు రిజెక్ట్ కాగా, 14 శాతంతో చైనా స్టూడెంట్స్ రెండో స్థానంలో ఉన్నారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన ఎక్కువ మంది విద్యార్ధుల వీసాలు రద్దు చేసినట్టు కూడా AILA ప్రకటించింది. 2023-24లో అమెరికాకు భారతీయ విద్యార్ధులే ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లారు. అమెరికాకు ఆ ఏడాదిలో 11 లక్షల 26,690 మంది విద్యార్ధులు వెళ్లగా అందులో 3 లక్షల 31,602 మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారు. తరువాత 2 లక్షల 77 వేల మంది చైనా విద్యార్ధులు రెండో స్థానంలో ఉన్నారు
అమెరికాలో భారతీయ విద్యార్ధుల వీసా కష్టాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి కారణాలు లేకుండానే వీసాలు తిరస్కరిస్తునట్టు సమాచారం వస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతో ఈవిషయంపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెంటనే చర్చలు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చిన్న చిన్న కారణాలతో భారతీయ విద్యార్ధులను వెనక్కి పంపిస్తున్నారు. పార్కింగ్ వివాదాలు , సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం , వాహనాన్ని పోలీసులు ఆపితే ఆపకపోవడం లాంటి ఆరోపణలతో విద్యార్ధులను వెనక్కి పంపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే వీసాల రద్దుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులతో అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలు సంప్రదిస్తున్నాయని, వారికి సాధ్యమైనంత మద్దతు ఇస్తున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. అమెరికాలోని భారతీయ విద్యార్థులు తమ వీసాల రద్దుపై స్థానిక అధికారుల నుండి సమాచారం అందుకున్నా తర్వాత MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
F-1 వీసా అనేది నాన్-ఇమిగ్రేంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్‌ను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతినిస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు – డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. ఇప్పుడు ట్రంప్ రాజ్యం వచ్చింది కాబట్టి.. విద్యార్థి వీసాల సంఖ్యలో మరింత కోత పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అసలే ట్రంపరితనం, ఆపై ఎవరూ చెప్పినా వినడు కాబట్టి.. స్టూడెంట్ వీసాలకు కోత, పైచదువులు చదవాలనుకునే విద్యార్థులకు గుండె కోత తప్పదంటున్నారు నిపుణులు. అదే గనుక జరిగితే, మన భారతీయ విద్యార్థులు కూడా పెద్దఎత్తున నష్టపోతారు. ఈసారి స్టూడెంట్ వీసాల సంఖ్యలో భారీగా కోత పడుతోంది. అసలే ట్రంప్, ఆపై అతి పెద్ద కత్తెరను నూరుతున్నాడు కాబట్టి..స్టూడెంట్ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ గండాన్ని మన విద్యార్థులు ఎంతవరకు దాటగలుగుతారో చూడాలి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..