మన్యం జిల్లా కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో పలువురు గ్రామస్తులు కొందరు ఒక దగ్గర కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. ఇంతలో ఒక పదిహేను అడుగుల కింగ్ కోబ్రా అటువైపు దూసుకు వచ్చింది. ఆ పామును చూసిన అక్కడ కూర్చున్న వారు భయంతో కొంత దూరంగా పరుగులు తీశారు. అనంతరం మరికొంత సమయం తర్వాత మరొక పదిహేను అడుగుల కింగ్ కోబ్రా అటువైపు దూసుకు వచ్చింది. ఒక పామే అనుకుంటే అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమైన రెండు కింగ్ కోబ్రాలను చూసిన అక్కడి స్థానికులు కంగుతిన్నారు.
రెండు భయంకరంగా ఉన్న పాములు సంచరిస్తున్న ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవడం శ్రేయస్కరమని భావించి వాళ్లంతా వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో రెండు కింగ్ కోబ్రాలు పెనువేసుకోవటం ప్రారంభించాయి. అక్కడ నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నించిన స్థానికులు ఒక నిమిషం ఆగి రెండు పాములు మధ్య జరుగుతున్న చర్యను చూడటం ప్రారంభించారు. అలా పెనవేసుకున్న కింగ్ కోబ్రాలు సయ్యాట ఆడటం ప్రారంభించాయి. సుమారు అరగంటకు పైగా రెండు పాములు మధ్య సయ్యాట స్థానికులకు భయాందోళనను రేకెత్తించింది. పదిహేను అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించడమే అరుదు.. అలాంటిది ఇప్పుడు రెండు కింగ్ కోబ్రాల సయ్యాట ఉత్కంఠగా మారింది. సయ్యాట ఆడే సమయంలో రెండు పాములు ఆవేశంగా ఉన్నాయి. ఆ సయ్యాట చూస్తున్న స్థానికులకు తెలియకుండానే చెమటలు పట్టాయి. సయ్యాట తరువాత కింగ్ కోబ్రాలు ఎలా ప్రవర్తిస్తాయో తెలియక అక్కడ ఉండటం మంచిది కాదని అక్కడి నుండి పరుగు పరుగున గ్రామంలోకి వెళ్లిపోయారు. అనంతరం తమ కళ్ళ ముందు జరిగిన కింగ్ కోబ్రాల సయ్యాట గురించి గ్రామస్తులకు తెలియజేశారు.
కింగ్ కోబ్రాలు సంచరిస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ వైపుకు కొద్ది రోజులు గ్రామస్తులు ఎవరూ వెళ్ళొద్దని గ్రామస్తులకు సూచించారు. అయితే అందుకు గ్రామస్తులు మాత్రం ససేమిరా అన్నారు. వ్యక్తిగత పనుల కోసం ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్లడం తప్పదని అక్కడ సంచరిస్తున్న కింగ్ కోబ్రాలను బంధించి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడమే సరైన మార్గమని అందుకోసం స్నేక్ క్యాచర్స్ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో విషయాన్ని స్నేక్ క్యాచర్స్కి తెలియజేశారు. ప్రస్తుతానికి భయానకంగా పదిహేను అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాలను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ గాలిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..