అది గాజువాక.. నడిరోడ్డు.. ఓ వ్యక్తి తన కుమార్తెను స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వస్తున్నాడు.. దారిలో ఓ సంచి కనిపించింది. అది కూడా చిరిగిపోయినట్టు ఉంది.. అనుమానాస్పదంగా కనిపించింది. దగ్గరకు వెళ్తే అందులో ఏముందో మరి..! పోనీలే అని వదిలేస్తే, ఆ సంచి పోగొట్టుకున్న వారి పరిస్థితి ఏంటి..? ఇదే ఆలోచించాడు ఆ వ్యక్తి. మనకెందుకులే మన దారిన మన పోదాం అని అనుకున్నాడో ఒకానొక సమయంలో.. మనది కాని వస్తువు కోసం మనం ఎందుకు ఆలోచించాలి.. అయినా ఎవరిదో ఈ యాచకుడిది అయి ఉంటుంది అని అనుకున్నాడు. కానీ.. వెళ్లిపోయే క్రమంలో ఆగాడు. దగ్గరకు వెళ్ళాడు.. సంచిని అటూ ఇటూ కదిపాడు. మెల్లగా తెరిచి చూశాడు.. వామ్మో.. లోపల కనిపించిన ఆ దృశ్యానికి ఆ వ్యక్తి షాక్..! వెంటనే ఆ సంచి పట్టుకుని తిన్నగా అక్కడికి వెళ్ళాడు..!
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం యాదవ జగ్గరాజుపేటకు చెందిన షణ్ముఖ కుమార్.. హిటాచి ఎటిఎం సెంటర్ నిర్వహిస్తున్నాడు. దానికోసం అప్పుడప్పుడు నగదు డ్రా చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గాజువాక వెళ్ళాడు షణ్ముఖ కుమార్. ఈ క్రమంలోనే బ్యాంకు నుంచి 3.60 లక్షల రూపాయలు విత్డ్రా చేసి.. ఓ సంచిలో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి మోటార్ బైక్పై బయలుదేరాడు షణ్ముఖ కుమార్. కొంత దూరం వెళ్ళాక చూసేసరికి అతని బ్యాగు కనిపించలేదు. దీంతో గుండెలు పట్టుకున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ జరిగిన విషయాన్ని చెప్పాడు.
పోలీసులు దర్యాప్తునకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ వచ్చాడు. తనకు భారీగా డబ్బులు దొరికాయని కొంతమంది సిబ్బందికి చెప్పాడు. కానీ వాళ్లు నమ్మలేకపోయారు. నగదుతో కూడిన ఆ సంచిని టేబుల్ పై పెట్టాడు కొర్ల శివకుమార్. తనకు ఆ బ్యాగు నడిరోడ్డుపై దొరికిందని, తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. అప్పటికే షణ్ముఖ కుమార్ తన నగదు సంచిపోయిందని చెప్పడంతో పోలీసులు.. శివకుమార్ తీసుకువచ్చిన సంచి అతనిదేనని గుర్తించారు. నగదు సంచిని షణ్ముఖ కుమార్ కు అప్పగించారు గాజువాక సీఐ పార్థసారథి. శివకుమార్ నిజాయితీని పోలీసులు అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..