మామూలుగా గోవాలో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి.! అని అక్కడికి వెళ్ళి వచ్చినా అనుభవం ఉన్నవారు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఇకపై గోవా వెళ్లేందుకు ప్రయాణించే వాహనాల విషయంలో కూడా హెచ్చరికలు చేయాలేమో. పాపం లీవ్స్ పెట్టుకుని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్ళాలని బుక్ చేసుకున్నవారికి హైదరాబాద్‌లోనే నరకం చూపించారు. దీంతో వారి ప్రయాణం హైదరాబాద్‌లోనే ఆకస్మాత్తుగా ఆగిపోయింది.
ఏప్రిల్ 17న 25 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు తరుణి ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్‌కు చెందిన ఏసీ బస్సులో రెడ్ బస్ యాప్ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ బస్సు ప్రయాణం అదే రోజు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. కానీ బస్ ఎక్కిన ప్రయాణీకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏసీ అస్సలు పనిచెయ్యడం లేదు, టైర్లు చిరిగిపోయి ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతూ దారుణమైన వాసన వస్తుంది. ఇదేంటి అని ఎంత ప్రశ్నించినా.. బస్సు సిబ్బంది నుంచి సమాచారం లేకపోవడంతో ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు ఆపి అందరూ ఆందోళనకు దిగారు. ప్రయాణికుల్లో ఒకరైన సిద్దిపేటకు చెందిన మహేష్ అందరి తరపున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో జీరో FIR నమోదు అయ్యింది. ఆపై కేసును LB నగర్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. అక్కడి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.