22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ వార్ వైపేనే నెలకొంది. బలాబలాల్లో మజ్లిస్‌కు మొగ్గు ఉన్నా.. వార్ వన్ సైడ్ కాదంటోంది భారతీయ జనతా పార్టీ. ఇంతకీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతోంది? గాలిపటాన్ని అడ్డుకునేందుకు కమలం ముందున్న దారేది? అన్నదీ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 22ఏళ్లుగా మజ్లిస్ పార్టీ ఏఐఎంఐఎం పార్టీకే ఏకగ్రీవం. కానీ ఇప్పుడలా కుదరదంటూ బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ. పాతబస్తీపై పట్టున్న మజ్లీస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడింది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. దాదారు 22 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 23వ తేదీన ఎన్నిక జరగనుంది.
హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో బలాబలాలను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబట్టలేదు. మెజారిటీ మెంబర్స్ ఉన్న ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న తరుణంలో సెకెండ్ హయ్యేస్టే మెజారిటీ ఉన్న బీజేపీ బరిలో దిగడంతో ఎన్నికల ఓటింగ్ అనివార్యమైంది. ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ తరపున గౌతమ్ రావు అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు.
ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం 112 ఓట్లు ఉండగా.. అందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మజ్లిస్ పార్టీకి 40 మంది కార్పోరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో 49 ఓట్ల బలం ఉంది. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు 6 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 25 మంది , బీఆర్ఎస్ కు 15+9 కలిపి 24. కాంగ్రెస్ 7+7 తో 14 సభ్యుల సంఖ్యాబలం ఉన్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పటికే పోలింగ్‌కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, ఎంఐఎంకు మద్ధతు తెలుపుతుందని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. నామినేషన్ నాడే తమ గెలుపు లాంఛనం అంటూ ఎంఐఎం అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు.
గెలుపు కోసం కావాల్సిన సరైన సంఖ్యాబలం లేకున్నా.. బల్దియాపై పట్టు బిగించేందు కాషాయనేతలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ జట్టుగా ఎంఐఎంకు సహకరిస్తున్నాయని ప్రజలకు ఫ్రూవ్ చేయడం తమ లక్ష్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో ఎంఐఎం ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ గెలుపును కోరుకుంటున్నారని, అందుకనుగుణంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పోరేటర్లు కూడా తమకు ఓటేస్తారని బీజేపీ అభ్యర్థి గౌతం రావు అంటున్నారు. జాతీయ వాదానికి, జాతీ విద్రోహులకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో డెఫినెట్ గా ఆయా పార్టీలను కాదని కార్పొరేటర్లు తనకు ఓటేస్తారని గౌతమ్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఏ ఎవైనా గెలుపోటములు లెక్కచేయకుండా పోటీ చేసే పార్టీ బీజేపీ అని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు.
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు.. గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఝలక్ ఇచ్చేలా తమకు ఉన్న 25 ఓట్ల కంటే అదనంగా ఓట్లు సాధిస్తామని అంటున్నారు. మరోవైపు ఇతర పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మాట్లాడి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ పార్టీలోకి వస్తామన్న కార్పొరేటర్లకు పొలిటికల్ కేరీర్ గ్యారంటీ కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో చివరి క్షణం వరకు బీజేపీ ప్లాన్ ఎంతమేరకు వర్క్ అవుట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గాలిపటం విజయబావుట ఎగురవేస్తుందా.. లేక నిజంగానే ఏదైనా మిరాకిల్ జరిగి కమలం వికసిస్తుందా వేచి చూడాలి..!
మరిన్ని తెెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..