ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఓ రోడ్డుకు మోక్షం వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఎదురుమొండి- గొల్లలమంద రోడ్డు కోతకు గురై తీవ్రంగా దెబ్బతింది. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ సమస్యను వీడియో తీయించి పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన రూ. 13.45 కోట్ల నిధులు విడుదల చేశారు. దీంతో మండలి బుద్ధప్రసాద్ పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కృష్ణా నది ప్రవాహ వేగంతో ఎదురుమొండి-గొల్లలమంద రోడ్డు కోతకు గురై దెబ్బతింది. దీంతో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దెబ్బ తిన్న రోడ్డు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను డ్రోన్ ద్వారా వీడియో తీయించి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. రూ.13.45 కోట్ల నిధులను ఎదురుమొండి-గొల్లలమంద రోడ్డు నిర్మాణం కోసం కేటాయించారని మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎదురుమొండి-గొల్లలమంద రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు మండలి బుద్ధ ప్రసాద్ 2024 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి జనసేనలో చేరారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించారు. దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఉద్దేశంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే అప్పటికే అవనిగడ్డలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్‌కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉందని పవన్ భావించారు. దీంతో ఆయనకే టికెట్ కేటాయించగా.. పవన్ కళ్యాణ్ అంచనాలను నిజం చేస్తూ మండలి బుద్ధప్రసాద్ ఘన విజయం సాధించారు.