Pahalgam terror attak: ముష్కరుల మారణకాండ.. కావలి ఇంజనీర్ ఒంట్లో 42 బుల్లెట్లు – nellore kavali person madhusudhan is died at jammu kashmir terror attack
జమ్మూ కాశ్మీర్ పహల్ గామ్ ఉగ్రదాడిలో తెలుగు వ్యక్తులు కూడా మరణించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ఇందులో ఉన్నారు. ఈయనపై ముష్కరులు బుల్లెట్ల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఏకంగా ఆయన ఒంట్లోకి 42 బుల్లెట్లు దూసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఆయన అక్కడిక్కడే మరణించారు. ఈ హఠాత్తు పరిణామంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధుసూదన్ సొంతూరు నెల్లూరు జిల్లా కావలి. ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు తల్లి దండ్రులు కావలిలోని కుమ్మర వీధిలో నివాసం ఉంటున్నారు. మధుసూదన్‌రావు బెంగుళూరులోని IBM కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మధుసూదన్‌రావుకు భార్య కామాక్షి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి కూతురు ఇంటర్మీడియట్, కొడుకు 8వ తరగతి చదువుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అలాగే మధుసూదన్ రావు తల్లిదండ్రులు తిరుపాలు, పద్మావతి కావలిలో అరటికాయల వ్యాపారం చేస్తున్నారు. అయితే, పిల్లలకు సమ్మర్ హాలీడేస్ ఉండటంతో పహల్ గామ్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడటానికి కుటుంబంతో కలిసి మధుసూదన్ జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే మంగళవారం అక్కడ ఉగ్రదాడి జరిగింది. ఈ కాల్పుల్లో మధుసూదన్ స్పాట్లోనే చనిపోయినట్టు చెబుతున్నారు.