పహల్గాం, ఏప్రిల్ 24: మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దాడి చేసిన వారిలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. విదేశీ ఉగ్రవాదులు మాట్లాడిన ఉర్దూ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందింది. వారితో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు భద్రతా సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. అధికారులు బుధవారం ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేశారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున రివార్డు కూడా ప్రకటించారు. నిందితుల్లో గతేడాది IAF కాన్వాయ్‌పై జరిగిన దాడిలోనూ ఓ అనుమానితుడి హస్తం ఉన్నట్లు ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి. మిగతా ఇద్దరు కుల్గాంలోని బిజ్బెహారా, థోకెర్పోరాకు చెందినవారని భావిస్తున్నారు.
పాక్‌లో శిక్షణ పొందారా?
వీరు 2017లో పాకిస్తాన్‌కు వెళ్లి గత ఏడాదే తిరిగి జమ్మూకి వచ్చారు. వారు పాకిస్తాన్లో శిక్షణ పొందారని సమాచారం. ఆ ఇద్దరు ఉగ్రసంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ దాడి అమలు చేయడానికి లష్కరే-ఎ-తోయిబా, జైష్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు కేంద్ర నిఘా సంస్థ వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అనేక ఉగ్రవాద దాడుల్లో భాగస్వామిగా ఉన్న లష్కరే అగ్ర కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ సైఫుల్లా ఖలీద్ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అతను 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు. దాడి అనంతరం ఉగ్రవాదులంతా పిర్ పంజాల్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలకు పారిపోయారు. సైన్యం, కేంద్ర పారామిలిటరీ దళాలతోపాటు జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
తల, చాతిపైనే కాల్పులు.. ఎందుకంటే?
దాడి చేసిన వారు బాడీ కెమెరాలను చిత్రీకరించి ఉంటారని పోలీసులు తిలిపారు. గత మూడేళ్లలో జమ్మూలో జరిగిన అన్ని దాడుల్లోనూ బాడీ, గన్-మౌంటెడ్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించారు. ఈ వీడియోలను ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఫుటేజీని ఉపయోగించి LET ప్రచార సామగ్రిని విడుదల చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు కాశ్మీర్‌లోకి ఎలా ప్రవేశించారో, వారు ఎంతకాలంగా లోయలో ఉంటున్నారో ఇప్పటికీ తెలియరాలేదు. సరిహద్దుల్లో ఉన్న దుర్బర పరిస్థితులను ఆధారంగా చేసుకుని ముష్కరులు దేశంలోకి ప్రవేశించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఖచ్చిత ఆధారలు లభించలేదు. ఏజెన్సీలు వివరాలను ధృవీకరించేపనిలో పడ్డాయి. బుధవారం ఘటనా స్థలానికి NIA అధికారుల బృందం చేరుకుంది. దర్యాప్తును స్థానిక పోలీసుల నుంచి ఏజెన్సీ స్వీకరించే అవకాశం ఉంది. స్థానిక పోలీసులు సహాయం అందించాలని, సాక్షులందరి వాంగ్మూలాలను పరిశీలించాలని ఓ అధికారి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి జరిగిన బైసారన్ మైదానాన్ని సందర్శించారు. శ్రీనగర్‌లో పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో, సైన్యంలోని ఉన్నతాధికారులతో భద్రతా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దాడి బాధితులను కూడా ఆయన కలిశారు. బాధితుల్లో ఎక్కువ మందిని తల, ఛాతీపై కాల్పులు జరిపారు. 12 మంది బాధితుల తలలకు బుల్లెట్ గాయాలున్నాయి. వీటిని ‘కోల్డ్ బ్లడెడ్ హత్యలు’ అని అంటారని ఓ అధికారి తెలిపారు. అడవి నుంచి వచ్చి.. మారణహోమం ముగిసిన తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లారు. దాడి సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్ కనిపించింది. కానీ ఉగ్రవాదులు పారిపోయే సమయంలో దీనిని ఉపయోగించలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మైనస్ డిగ్రీల్లోనూ ఉగ్రమూక చురుకు కదలికలు.. గాడ్జెట్ల వినియోగం శూన్యం
దాడి జరిగిన ప్రాంతంలో పర్యాటకుల సౌకర్యం కోసం టెంట్లు, ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి. కొంతమంది స్థానిక విక్రేతలు తిను బండారాలు అమ్ముతుంటారు. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యంలేనందున పర్యాటకులు కాలనడకన లేదంటే గుర్రంపై పహల్గామ్ మార్కెట్ నుంచి 5-6 కి.మీ దూరం ప్రయాణిస్తుంటారు. ఇక్కడికి నిత్యం వేలాడి మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది హపట్నార్ను మరోవైపు చందన్వారీకి అనుసంధానించే దట్టమైన అటవీ ప్రాంతం కూడా. ఈ అడవులనే ఉగ్రవాదులు ఆసరాగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఇలాంటి రద్దీ టూరిస్ట్ ప్లేస్‌లో భద్రతా చర్యలు ఎందుకు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి, ఉగ్రవాదుల కదలికలు పసిగట్టడం అంత తేలికకాదు. ఈ ఉగ్రవాదులు చిన్న చిన్న సమూహాలుగా పనిచేస్తుంటారు. మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా అడవుల నుంచి వారు బయటకు రారు. ఎటువంటి గాడ్జెట్లను ఉపయోగించరు. అందుకే సాంకేతిక ద్వారా నిఘాను సేకరించే అవకాశం లేదు.
దట్టమైన అడవులే ప్రధాన స్థావరం..
అంతేకాకుండా వారు స్థిరంగా ఓ చోట ఉండరు. తమ స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు. ఉదాహరణకు.. సోనార్గ్ శిఖరాలపై ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు సమాచారం అందితే అధికారులు స్పందించేలోపు ఉగ్రమూక వేరే ప్రాంతానికి తరలివెళ్లిపోతారు. ఇదంతా చేసేందుకు వారికి అడవులే ఆధారం. దాడి చేసిన వారు ఇటీవలే చొరబడినట్లు కనిపిస్తోందని మరో పోలీసు అధికారి తెలిపారు. బైసారన్ పర్వతాలు, దట్టమైన అడవులు ఉగ్రవాదులకు సహజ ఆశ్రయం కల్పిస్తుందని అన్నారు. అడవుల గుండా కోకర్నాగ్, కిష్త్వార్ వైపు గానీ లేదంటే బాలతాల్, సోనామార్గ్ వైపుగానీ వెళ్లే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాల స్థలాకృతి చూస్తే.. కిష్త్వార్ పర్వతాలు, దట్టమైన అడవుల ద్వారా జమ్మూలోని కథువాకు అనుసంధానించబడిన దోడా వరకు ఉన్నాయి. ఇటీవల కాలంలో కథువా ద్వారా చొరబాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.