
ఇస్లామాబాద్, ఏప్రిల్ 24: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులు లక్ష్యంగా జరిగిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ముఖ్యంగా పర్యాటకులు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిమరీ ముష్కరులు దాడి చేయడం అత్యంత పాశవికం. ఈ సంఘటనలో కనీసం 27 మంది భారతీయ పర్యాటకులు మరణించగా, కనీసం 17 మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని బుధవారం (ఏప్రిల్ 23) రద్దు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌పై తీసుకుంటున్న తక్షణ చర్యలను న్యూఢిల్లీ ప్రకటించింది.
పాకిస్తాన్ తీరు మార్చుకుని సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు 1960 నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. అంతేకాకుండా వాఘా-అట్టారి సరిహద్దు క్రాసింగ్‌ను వెంటనే మూసివేస్తామని మిస్రీ ప్రకటించారు. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం, పౌర ఉద్యమానికి ప్రాథమిక స్థావరం. అలాగే పాకిస్తాన్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లడానికి 48 గంటల గడువు ఇచ్చింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న వైమానిక దళం, సైన్యం, నేవీకి చెందిన అన్ని పాకిస్తాన్ సైనిక సలహాదారులను దేశం విడిచి వెళ్లడానికి వారం సమయం ఇస్తున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి ఈ సందర్భంగా ప్రకటించారు.
అంతేకాకుండా పాక్‌లోని భారత్‌కి చెందిన ముగ్గురు సైనిక సేవా సలహాదారులను, ఇస్లామాబాద్‌లోని హైకమిషన్ నుంచి ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా వెనక్కి పిలుస్తోంది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ జాతీయులు భారత్‌కి ప్రయాణించడానికి ఎలాంటి అనుమతి ఉండబోదని మిస్రి చెప్పారు. గతంలో పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన SVES వీసాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం SVES వీసా కింద భారత్‌లో ఉన్న ఏ పాకిస్తానీ జాతీయుడైనా భారత్ విడిచి వెళ్ళడానికి 48 గంటల సమయం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలని కూడా భారత్ నిర్ణయించింది.
భారత్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) ఠంచన్ గా ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. IWTని నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేయడం వంటి భారత్ వరుస కఠిన చర్యలను పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ తీవ్రంగా విమర్శించారు. భారత్ నిర్ణయాలు తీవ్రమైనవి, అనుచితమైనవిగా పేర్కొన్నారు. భారత్‌లో జరిగిన ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌కు సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలను భారత్ సమర్పించలేదు. ఆధారాలను సేకరించడంలోనూ విఫలమైంది.
కేవలం కోపావేశంలోనే స్పందించినట్లు తెలుస్తోంది. భారత్ ప్రకటనలు తీవ్రత లోపాన్ని ప్రతిబింబిస్తుందని దార్ అన్నారు. అంతేకాకుండా భారత్ సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా పాకిస్తాన్‌పై నిందలు వేస్తుందని, ఉగ్రవాదులపై కోపాన్ని పాక్‌పై వెళ్లగక్కడం సముచితం కాదని అన్నారు. కేవలం ఆరోపణలు కాకుండా ఆధారాలు సమర్పించాలని ఇషాక్ దార్ కోరారు. భారత్ చర్యలకు పాకిస్తాన్ తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడాన్ని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లెఘారీ.. నిర్లక్ష్య చర్య, చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.