గువాహటి, ఏప్రిల్ 25: మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో దారుణ మారణహోమం జరిగిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూక ఒక్కసారిగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్ ఉగ్రమూక దాడిపై యావత్ ప్రపంచం కన్నెర్ర చేసింది. అయితే దేశంలోని ఓ ఎమ్మెల్యే మాత్రం ఇందుకు విరుద్దంగా ఉగ్రవాద దాడి చేసిన పాకిస్తాన్‌ను సమర్థించాడు. అస్సాం రాష్ట్రప్రతిపక్ష ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు గురువారం (ఏప్రిల్ 24) అరెస్ట్ చేశారు. ఈ మేరకు పహల్గాం ఉగ్ర ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంపై ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి కటకటాల వెనుక వేశారు. ఆయనను నాగావ్ జిల్లాలోని తన నివాసంలో అరెస్టు చేశారు.
దీనిపై స్పందించిన AIUDF పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్.. ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ అభిప్రాయాలు ఆయన సొంత అభిప్రాయాలే తప్ప పార్టీవి కావని స్పష్టం చేశారు. అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇది మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన సమయం. ఉగ్రవాదులకు మతం లేదు. ఈ ఉగ్రవాదులు ఇస్లాంను కించపరుస్తున్నారని అజ్మల్ అన్నారు. అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. మరోవైపు ఆ రాష్ట్ర సీఎం హిమంత మాట్లాడుతూ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌పై దేశదోహ్రం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఏ విధంగా మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్.. డింగ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఎమ్మెల్యే ఇస్లాం తప్పుడు ప్రకటన చేస్తూ, రెచ్చగొట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిని పోలీసులు గమనించి, అతడిపై చర్యలకు ఉపక్రమించినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) స్వప్ననీల్ దేకా తెలిపారు. అతన్ని అరెస్టు చేశామని శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.