విశాఖపట్నం జిల్లాలో సెల్ ఫోన్ లాక్కున్నందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఇంజనీరింగ్ విద్యార్థిని చెప్పుతో కొట్టిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. భీమిలి మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విద్యార్థిని ప్రవర్తన, తీరుపై నెటిజనం మండిపడ్డారు. అయితే ఈ క్రమంలోనే కాలేజీ యాజమాన్యం విద్యార్థినిపై చర్యలు తీసుకుంది. విద్యార్థినిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఉత్తర్వులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. బీటెక్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని క్లాస్ రూమ్‌లోకి సెల్ ఫోన్ తీసుకువచ్చారు. తరగతి గదిలోకి సెల్ ఫోన్ తీసుకురావటమే కాకుండా.. మిగతా స్టూడెంట్లను ఫోటోలు తీసింది. వారితో గొడవ పడింది. దీంతో విద్యార్థినులు అసిస్టెంట్ ప్రొఫెసర్లలకి ఫిర్యాదు చేశారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కోవటంతో సదరు విద్యార్థిని విచక్షణ కోల్పోయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద చెప్పుతో దాడి చేసింది. ఫోన్ ఇస్తావా? ఇవ్వవా.? ఇవ్వకపోతే చెప్పుతో కొడతానని బెదిరిస్తూ కాలి చెప్పు తీసి ముఖంపై దాడి చేసింది. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న విద్యార్థినులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆ విద్యార్థిని తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.
అయితే తమ కుమార్తె మతిస్థిమితం సరిగా లేక ఇలా జరిగిందని విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రాధేయపడినట్లు తెలిసింది. అయితే వ్యవహారం పెద్దది కావటంతో కళాశాల యాజమాన్యం సదరు విద్యార్థినిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఏప్రిల్ 21 నుంచే విద్యార్తినిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఫ్యాకల్టీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా తక్షణమే విద్యార్థిని కళాశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అందులో ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ఈ ఘటనపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.