ఇంట్లోకి ఎలా జొరబడ్డారో, ఎప్పుడు జొరబడ్డారో తెలీదు. దంపతులిద్దరినీ దారుణంగా చంపేశారు. తర్వాత తీరిగ్గా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది డబుల్ మర్డర్. దువ్వాడ రాజీవ్‌నగర్ రాసాలమ్మ కాలనీలో జరిగిందీ దారుణం. పోలీసులు తాళాన్ని కట్ చేసి లోపలికెళ్లిచూస్తే రక్తపు మడుగులో పడున్నాయ్ దంపతుల మృతదేహాలు. ఒక గదిలో భర్త యోగేంద్ర బాబు, మరో గదిలో భార్య లక్ష్మి మృతదేహాలు కనిపించాయి.
నేవెల్ డాక్‌యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు, భార్య లక్ష్మితో ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మేనల్లుడు ఇంటికొచ్చేసరికి తాళం వేసి ఉంది. ఫోన్‌చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. లక్ష్మి శరీరంపై బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. యోగేంద్ర స్కూటీ కూడా కనిపించడం లేదు.
దంపతుల హత్య దొంగల పనేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతర అంశాలపైనా దృష్టి సారించారు పోలీసులు. 8 బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌ని పరిశీలించారు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి. దాదాపు 40 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు యోగేంద్ర, లక్ష్మి. వీరి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. పిల్లలతో సంబంధాలు ఎలా ఉన్నాయి.. దంపతులకు వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్‌లోనూ సాగుతోంది పోలీస్ ఎంక్వయిరీ.
క్లూస్ టీం ద్వారా ఆధారాల సేకరణ ప్రారంభించారు పోలీసులు. డాగ్‌స్క్వాడ్‌ని రంగంలోకి దించారు. పాదముద్రలు, ఫింగర్‌ప్రింట్లు పరీక్షిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మృతుల ఫోన్ రికార్డులు, చివరిగా ఎవరితో మాట్లాడారనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన రోజు లేదా మర్నాడు ఈ ఘోరం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో అరుపులు వినిపించాయని.. అయితే భార్యాభర్తలు గొడవపడుతున్నారని భావించి వెళ్లలేదంటున్నారు స్థానికులు.
అందరూ గ్రామదేవత పండుగ హడావుడిలో ఉండగా అదను చూసుకుని దుండగులు ఇంట్లోకి జొరబడి ఉంటారని భావిస్తున్నారు. అయితే బంగారం, నగదు కోసమే హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై పోలీసులు లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..