కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనాలకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సెలవుల్లో కొండపై రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక, వేసవి సెలవుల్లో రెండు నెలలు ఇసుకేస్తే రాలని జనం. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక. మే, జూన్ నెలల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ మార్పుల గురించి తెలుసుకుని మీ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోండి.
హైలైట్:
- తిరుమలలో వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో ఏర్పాట్లు
- రెండు నెలల పాటు సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు
- మే 1 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉండనున్న నిర్ణయం

‘‘మే, జూన్ నెలల్లో సెలవులు కావడంతో తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.. మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు” ఆయన వివరించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుంచి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇందుకోసం మే 10న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగుతుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఉత్సవాల్లో భాగంగా మే 12న ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం.. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉంటాయి.
భక్తులకు అలర్ట్.. వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్?
భక్తులకు అలర్ట్.. వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్?
మే 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా జల్లి సంప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.