విజయనగరం, ఏప్రిల్ 27: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లావాని తోట పంచాయతీ నడుపూరు గ్రామానికి చెందిన పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (53) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రాజశేఖర్ అనే కొడుకు, రాధ అనే కుమార్తె ఉన్నారు. అప్పలనాయుడు 80 సెంట్లు భూమి ఉన్న ఒక చిన్నకారు రైతు. తనకున్న 80 సెంట్లులో కూరగాయలు, ఆకుకూరలు పండించి జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె రాధకు ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. రాధకు ఇద్దరు పిల్లలు. అయితే అకస్మాత్తుగా అనారోగ్యంతో రాధ భర్త మరణించాడు. అప్పటినుండి అప్పలనాయుడు దంపతులే రాధకు అండగా ఉంటూ వస్తున్నారు. రాజశేఖర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి నెల్లిమర్ల మండలం వల్లాపురంకు చెందిన ఓ యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది.
వివాహ అనంతరం రాజశేఖర్ చెడు అలవాట్లకు బానిస అయ్యి అప్పుల పాలయ్యాడు. ఓ వైపు భర్త మరణంతో తమపై ఆధారపడి ఉన్న కుమార్తె జీవితం, మరోవైపు చెడు అలవాట్లతో అప్పులు పాలైన కుమారుడిని చూసి అప్పలనాయుడు దంపతులు తల్లడిల్లిపోతుండేవారు. అయితే అప్పలనాయుడు తన 80 సెంట్లు భూమిలో 20 సెంట్లు భూమిని రాధ వివాహ సమయంలో కట్నంగా ఇవ్వగా, చెడు అలవాట్లకు బానిసైనా కొడుకు మిగతా భూమిని ఎప్పుడైనా విక్రయించే అవకాశముందని గ్రహించిన అప్పలనాయుడు దంపతులు మరో 30 సెంట్లు భూమిని కూడా కుమార్తె రాధకు రిజిస్ట్రేషన్ చేశారు. అలా తన 80 సెంట్ల భూమిలో కుమార్తె రాధకు 50 సెంట్లు ఇచ్చారు. ఇది తెలుసుకున్న కొడుకు రాజశేఖర్ తరచూ రాధకు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తనకి ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. అయినా అప్పలనాయుడు మాత్రం ససేమిరా అన్నాడు. ఈ నేపథ్యంలోనే అప్పుల బాధలు భరించలేక తండ్రి అప్పలనాయుడు వద్ద ఉన్న భూమిని అమ్మటానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా భూమిని చదును చేసేందుకు జెసిబి, ట్రాక్టర్ సహాయంతో పొలంలో పనులు చేస్తున్నాడు. భూమిని విక్రయించేందుకు పొలంలో పనులు చేస్తున్నాడని తెలుసుకున్న అప్పలనాయుడు దంపతులు ఇద్దరు పొలం వద్దకు చేరుకొని కుమార్తె రాధకు ఇచ్చిన భూమిని కూడా చదును చేయడాన్ని అడ్డుకున్నారు.
దీంతో పట్టరాని కోపంతో రాజశేఖర్ తన వద్ద ఉన్న ట్రాక్టర్ తో తల్లిదండ్రుల పై దాడికి దిగాడు. వెంటనే ప్రక్కనే ఉన్న ట్రాక్టర్ ఎక్కి ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు పరుగు పరుగున అక్కడ నుండి పారిపోయి రాజశేఖర్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే రాజశేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారిని గుద్దేందుకు మరోసారి ప్రయత్నించాడు. పరిస్థితి చెయ్యి దాటిందని గమనించిన తల్లిదండ్రులు కొడుకు రాజశేఖర్ కి చేతులెత్తి దండం పెట్టి తమను వదిలేయమని బ్రతిమలాడారు. అయినా ఏమాత్రం చలించని రాజశేఖర్ తల్లిదండ్రులను ట్రాక్టర్ తో గుద్ది అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ ఘటన అంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. జరుగుతున్న ఘటన అంతా భూమిలో పనులు చేస్తున్న మిగతావారు చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకొని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడు రాజశేఖర్ కోసం గాలిస్తున్నారు. అప్పలనాయుడు దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయనగరం జిల్లాలో జరిగిన దారుణ ఘటన అందరినీ కలిచి వేస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.