
14ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం.. ప్రస్తుతం ప్రతిపక్షం. మూడుముక్కల్లో చెప్పాలంటే ఇదీ బీఆర్ఎస్ ప్రస్థానం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించిన కేసీఆర్.. రాష్ట్ర సాధన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న కారు పార్టీ ఆవిర్భవించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో రజతోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.
బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీకి హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారుపార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటైంది. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది.
ప్రత్యేక ఏర్పాట్లు..
సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 10లక్షల వాటర్ బాటిల్స్, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 అంబులెన్స్‌లు, 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక, పార్కింగ్ కోసం 2,000 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తారు. అలాగే… విద్యుత్ సమస్య రాకుండా 250 జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఇక, సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా జనం తరలివస్తారంటూ పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. కేవలం బస్సులే కాకుండా.. డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు ఇలా వేల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్‌లతో జనాలను సభకు తరలిస్తున్నారు.
గులాబీ దళపతి స్పీచ్ పై ఉత్కంఠ..
సభ ఏర్పాట్లన్నీ ఓ ఎత్తైతే.. గులాబీ దళపతి స్పీచ్ మరో ఎత్తనే చెప్పాలి. ఆయన ఏం మాట్లాడతారని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, పథకాల అమలు, కాంగ్రెస్ నేతల విమర్శలు ఇలా అన్నింటిపై ఆయన ఎలా రియాక్ట్ ఆవుతారోనని అందరు ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికలను కూడా ఇదే వేదిక నుంచి కేసీఆర్ వివరించే అవకాశం ఉంది.
మొత్తంగా… గతకొన్నిరోజులగా బీఆర్ఎస్ సభపై ఫుల్ హైప్ నెలకొంది. ఆదివారం మరో మేడారం జాతరను చూడబోతున్నారని చెబుతున్నారు నేతలు. మరి చూడాలి బీఆర్ఎస్ సభ ఎలాంటి రీసౌండ్ చేస్తుందో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..