తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వీలైనంత త్వరలో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదల చేసి.. మే నెలలో పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకం పేరుతో నెల్లూరు జిల్లా కావలిలో ఓ మహిళను మోసం చేశారు. తల్లికి వందనం పేరుతో ఫోన్ చేసిన ఆగంతకుడు మహిళ నుంచి 71 వేల రూపాయలు కాజేశాడు. ఈ ఘటనపై సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కావలిలో తల్లికి వందనం పథకం పేరుతో ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టకు చెందిన ఓ మహిళకు ఇటీవల ఫోన్ వచ్చింది. అవతలి నుంచి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తల్లికి వందనం పథకం కింద నగదు రావాలంటే తమ సూచనలను ఫాలో కావాలని చెప్పాడు. తాము చెప్పినట్లు చేయాలని సూచించాడు. అలా చేస్తేనే డబ్బులు జమ అవుతాయని ఆ మహిళను నమ్మించాడు. వాట్సాప్‌లో ఫోన్‌పే స్కానర్ ద్వారా తల్లికి వందనం పథకం నగదు జమవుతుందని నమ్మబలికాడు. దీంతో అతను చెప్పినట్లు ఆమె చేసింది. ఫోన్‌పే స్కాన్ చేసి రూ.15 వేలు ఎంట్రీ చేసింది. అయితే పాస్వర్డ్ నమోదు చేయలేదు కదా.. తన డబ్బులు ఎక్కడికీ వెళ్లవనే ధీమాతో ఉంది.
అయితే ఆ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆ ఆగంతకుడు అయిదుసార్లు రూ.71 వేల వరక ఆమె బ్యాంక్ ఖాతా నుంచి కాజేశాడు. దీంతో వెంటనే ఆ మహిళ కావలి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాను మోసపోయిన సంగతిని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15000 చొప్పున ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కూడా వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.