తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన కంపెనీ టీటీడీకి భారీ విరాళం అందించింది. చెన్నైకు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందించింది. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళం తాలుకు చెక్కును కంపెనీ ఎండీ అందించారు, మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు సమయం పట్టింది.

తిరుమలలో భక్తుల రద్దీ
వేసవి సెలవుల సీజన్ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం రోజున తిరుమల శ్రీవారిని 82,811 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,913 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా 3.24 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నట్లు తెలిపింది. అలాగే తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం కోసం 18 గంటలు సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో పేర్కొంది.
TTD Donations: టీటీడీకి భారీ విరాళం.. కళ్లుచెదిరే మొత్తం అందించిన చెన్నై సంస్థ..
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు
మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వచ్చే నెలలో వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మే 11 నుంచి మే 13 వరకూ మూడు రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మే పదో తేదీ సాయంత్రం 6 గంటలకు వసంతోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. వసంతోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తులు రూ. 150 చెల్లించి పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. వసంతోత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు.
వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి వేళ ఆలయ మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు. వసంతోత్సవం నేపథ్యంలో మే 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. వసంతోత్సవాల కారణంగా కళ్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.