వృషభం: జాతక చక్రంలో సహజ కుటుంబ స్థానం అయినందువల్ల, ఈ రాశికి అధిపతి శుక్రుడు అయినందు వల్ల ఈ రాశి వారికి కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం ఎక్కువ. జీవిత భాగస్వామి పట్ల, కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగానూ భద్రతనిస్తారు. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామికి సహాయ సహకారాలందిస్తారు. ప్రేమల్లోనూ, సహజీవనాల్లోనూ, చివరికి స్నేహాల్లోనూ నీతి నిజాయతీలతో వ్యవహరిస్తారు. వీరితో జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కర్కాటకం: ఈ రాశివారిలో సాధారణంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సర్దుకుపోయేతత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు స్నేహంలో అయినా, ప్రేమలో అయినా, వైవాహిక బంధంలో అయినా మానసిక బంధానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. ఈ రాశివారికి కుటుంబ జీవితం మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రేమ భాగస్వామిని లేదా జీవిత భాగ స్వామిని నొప్పించడం ఉండదు. కుటుంబ భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడతారు.
కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు నీతి నిజాయతీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. అందువల్ల ఈ రాశికి చెందినవారు ఏ బంధం విషయంలో అయినా కొన్ని విలువలకు కట్టుబడి ఉంటారు. వివాహ బంధానికి, స్నేహ బంధానికే కాక, ప్రేమలకు, చివరికి సహజీవనానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తారు. వీరితో ఒకసారి బంధం అంటూ ఏర్పడితే దాన్ని వదులుకోవడం ఉండదు. వీరి కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఈ రాశివారితో ఏ బంధమైనా కలకాలం కొనసాగుతుంది.
తుల: ప్రేమలు, అనుబంధాలకు కారకుడైన శుక్రుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఈ రాశివారు సాధారణంగా కుటుంబ సభ్యులను, జీవిత భాగస్వామిని ఎక్కువగా సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తారు. ప్రేమ భాగస్వామికి, జీవిత భాగస్వామికి, స్నేహబంధానికి ఎంతో విలువనిస్తారు. ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా సహజీవనంలో కూడా నిజాయతీగా వ్యవహరిస్తారు. వీరితో పెళ్లయినా, స్నేహమైనా, ప్రేమైనా హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం శ్రమపడతారు.
మకరం: క్రమశిక్షణకు, నీతి నిజాయతీలకు, విలువలకు, సంప్రదాయాలకు మారుపేరైన శనీశ్వరుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఏ బంధం విషయంలోనైనా ప్రేమాభిమానాలతో వ్యవహరిస్తారు. పెళ్లి, ప్రేమ, సహజీవనం, స్నేహ బంధాలకు వీరు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వైవాహిక జీవితానికి కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామిని, ప్రేమ భాగస్వామిని, మిత్రులను హ్యాపీగా ఉంచడానికి గరిష్ఠంగా ప్రయత్నిస్తుంటారు. బంధాల విషయంలో వీరు నమ్మదగిన వ్యక్తులు.
మీనం: ఈ రాశివారు సున్నిత మనస్కులు. వీరిలో ఆధ్యాత్మిక చింతన కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, స్నేహం, సహజీవనం వంటి బంధాల విషయంలో వీరు నిజాయతీగా ఉంటారు. ఎవరి నైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ఈ రాశికి అధిపతి గురువు అయినందువల్ల జీవిత భాగస్వామి, ప్రేమ భాగస్వామి, మిత్రుల విషయంలో వీరు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు. తమకు సన్నిహితులైనవారిని మాటలతో, చేతలతో బాధపెట్టడం జరగదు. కుటుంబ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తారు.