ఎప్‌సెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 నగరాల్లో 124 ఎగ్జామ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మా విభాగాలకు చెందిన పరీక్ష జరగనుంది. మే 2 నుంచి 4వ వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ప్రతిరోజు రెండు సెషన్లలో ఎప్‌సెట్ ఎగ్జామ్స్‌ను నిర్వహించనుండగా.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన పరీక్షకు అనుమతించేది లేదంటూ అధికారులు స్పష్టం చేశారు. ఒక్క నిమిషం నిబంధన కఠినంగా అమలుచేస్తుండటంతో విద్యార్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈసారి హాల్ టికెట్లలో ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్‌తో లింక్ చేయబడిన క్యూ ఆర్ కోడ్‌ను చేర్చినట్టు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే పరీక్షా కేంద్రానికి దూరం సహా పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. ఎప్ సెట్ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఈ సారి నమూనా పరీక్ష పేపర్లను ఉన్నత విద్యామండలి అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఆన్లైన్లో ఎలాంటి పాస్వర్డ్ లేకుండానే వివిధ పేపర్ల మాక్ టెస్టులను విద్యార్థులు వినియోగించుకున్నారు. ఎప్ సెట్ కు మొత్తం 3 లక్షల పైన విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2 లక్షల 20 వేల 49 మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కోసం 86,493 మంది అప్లై చేశారు. ఈ రెండింటికి కలిపి 254 అప్లికేషన్లు వచ్చాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షలు పూర్తయిన పదిహేను రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ సారి నేరుగా అభ్యర్థుల మొబైల్స్ కు ఫలితాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..