ఆపరేషన్ కగార్ హీట్ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ బోర్డర్ లో నెలకొన్న పరిస్థితులు.. కర్రెగుట్టలో కూంబింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణపై చర్చ జరిగింది.. నిన్న పీస్ కమిటీ సూచించిన అంశాలపై జానారెడ్డితో చర్చించారు.. 2005లో జరిగిన శాంతి చర్చలపై సీఎం ఆరా తీయగా.. అప్పటి కాంగ్రెస్ నిర్ణయాలను జానారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అయితే.. జానా రెడ్డితో భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కగార్‌పై పార్టీలో నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని తెలిపారు. నిన్న తాము నిర్ణయం ప్రకటించాకే కేంద్రానికి లేఖ రాస్తామంటూ కేసీఆర్ ప్రకటించారని రేవంత్ గుర్తుచేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అభద్రతాభావంలో మాట్లాడారని.. ఆయన స్పీచ్‌లో క్లారిటీ లేదంటూ పేర్కొన్నారు. కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని.. రాహుల్‌గాంధీకి, తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవమంటూ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ, తాను రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నామని.. ఆ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారు.. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలంటూ రేవంత్ రెడ్డి పేర్కొ్న్నారు. కేసీఆర్ విమర్శలు ఇప్పుడు కాదు.. అసెంబ్లీకి వచ్చి చేయాలన్నారు.
పొగరు పెరిగింది.. అలాంటి వారికి పదవులు రావు..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అలర్ట్ చేసారు.. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగింది.. సీఎల్పీలో చెప్పినా తీరు మారలేదని సీఎం పేర్కొన్నారు.. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైమ్‌పాస్ చేయడం సరికాదంటూ పేర్కొన్నారు. పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీలో అంతర్గత విషయాలు, కొందరు నేతల విమర్శలు.. గురించి కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయి.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారంటూ.. క్లియర్ కట్‌గా చెప్పారు. కొందరు పదవులు రాలేదని నోరుజారుతున్నారని.. వాళ్లకు పదవులు రావు.. అవకాశాలు ఉండవంటూ స్పష్టంచేశారు. పార్టీలో ఓపికతో ఉంటే పదవులు వస్తాయని చెప్పారు. తాను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..