హైదరాబాద్, ఏప్రిల్ 28: రైల్వే శాఖలో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో పోస్టుల భర్తీకి ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయా పోస్టులకు తాజాగా నియామక పరీక్షలు కూడా జరిపింది. మరికొన్ని ఉద్యోగాలకు నియామాక పరీక్షలు జరగనున్నాయి. అయితే రైల్వేలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 22న సీబీటీ 2 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక కీ కూడా ఇటీవల విడుదలైంది. అభ్యర్థులు రూ.50 చెల్లించి కీ పై అభ్యంతరాలను ఏప్రిల్ 30వ తేదీలోపు తెలపవచ్చని బోర్డు వెల్లడించింది. లేవనెత్తిన అభ్యంతరం సరైనదని తేలితే అభ్యర్థి ఆన్లైన్ చెల్లింపు చేసిన ఖాతా నుండి వాపసు చేస్తారు.
అయితే ఈపరీక్షకు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్బీ జేఈ షిఫ్ట్-2 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 22న నిర్వహించిన ఈ పరీక్షలో ఉదయం షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు రెండవ షిఫ్ట్‌లో కూడా వచ్చినట్లు గుర్తించింది. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటన జారీ చేసింది. సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగినట్లు ఆర్ఆర్బీ వివరణ ఇచ్చింది. ఇక పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 20,792 మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలో వారందరికీ పరీక్షను మరోసారి నిర్వహించనున్నట్లు ఆర్ఆర్బీ వెల్లడించింది.
RRB ఏఈ పరీక్ష రద్దు ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ప్రశ్నల సెట్లను క్రియెట్ చేయడానికి, ప్రాసెసింగ్, నిర్వహణ, నిల్వ, ఎన్క్రిప్షన్ వంటి వాటికోసం అడ్మిన్‌లో అత్యున్నత స్థాయి గోప్యతను నిర్వహించడానికి ఆర్ఆర్బీ ఓ వ్యవస్థను అనుసరిస్తుంది. ప్రశ్నపత్రాల సెట్టింగ్, పరీక్షా కేంద్రాలకు పంపడంతో మానవ జోక్యం లేకుండా ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా చేస్తుంది. ఇదంతా సాఫ్ట్వేర్ ఆధారిత పద్దతి ద్వారా జరుగుతుంది. కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య కారణంగా ఈ నెల 22న జరిగిన 2వ షిఫ్ట్‌లో పరీక్షలో కొన్ని ప్రశ్నలు పునరావృతం అయినందున ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని, త్వరలోనే వీరికి కొత్త పరీక్ష తేదీని వెల్లడించి, మరోమారు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో ఆర్ఆర్బీ తెలిపింది.
మరిన్ని విద్యా, ఉద్యగ వార్తల కోసం క్లిక్ చేయండి.