తాలిబన్ నేతలతో భారత ప్రత్యేక రాయబారి ఆనంద్ ప్రకాష్ సమావేశం అయ్యారు. పలువురు అధికారులతో కలిసి ఆయన ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌కు వెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తాకితో ఈ సందర్భంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రవాణా సహకారాన్ని పెంపొందించడం, ఇటీవలి ప్రాంతీయ పరిణామాల చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత, వీసా విధానాలను క్రమబద్ధీకరించడం, ప్రతినిధి బృందాల మార్పిడిని ప్రోత్సహించడం, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరు దేశాల అధికారులు ప్రస్తావించారు.
అలాగే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌తో మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి, రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలను సులభతరం చేయాలని కోరారు. వ్యాపారవేత్తలు, రోగులు, విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియలను సులభతరం చేయాలని భారత్ ను అభ్యర్థించారు.
వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవాలనే ఆశాభావాన్ని భారత రాయబారి ఆనంద్ ప్రకాష్ వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ తన సహాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యాన్ని వెల్లడించారు. గతంలో నిలిపివేసిన కొన్ని కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఇండియా ఆసక్తి చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..