Google in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే లులూ గ్రూప్ వంటి సంస్థలు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ఏపీలో కొలువు దీరనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై కీలక ప్రకటన చేశారు. అమరావతిలో వి- లాంచ్ పాడ్ 2025ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీకి గూగుల్ రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

స్టార్టప్ కంపెనీల కోసం అమరావతిలో వి- లాంచ్ పాడ్ 2025ను చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. విశాఖకు త్వరలోనే గూగుల్ రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నానికి గూగుల్ వస్తే.. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏపీ మారుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో 14 నెలల్లోనే హైటెక్ సిటీ పూర్తి చేశామన్న చంద్రబాబు.. అప్పట్లో ఐటీని ప్రోత్సహిస్తే, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు గవర్నమెంట్ అటెండర్ పోస్టుకు కూడా డిమాండ్ ఉండేదన్న చంద్రబాబు.. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగాలకే ఎక్కువ డిమాండ్ ఉందని వివరించారు.
మరోవైపు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం ఇప్పటికే అధికారులు భూమిని కూడా సిద్ధం చేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో 250 ఎకరాలు గుర్తించారు. ఈ ప్రదేశం ఆనందపురం మండలానికి మూడు కిలోమీటర్లు, 16వ నంబర్ జాతీయ రహదారికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీంతో తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 2024 డిసెంబరులోనే గూగుల్ ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలే విశాఖపట్నానికి వచ్చి మరీ భూములను పరిశీలించారు. గూగుల్ డేటా సెంటర్ కోసం సుమారుగా 80 ఎకరాలు అవసరం అవుతుందని ఆయన అధికారులను తెలియజేశారు. ఈ నేపథ్యంలో చాలా చర్చల తరువాత ఆనందపురం మండలం తర్లువాడలోని భూములను గూగుల్ డేటా సెంటర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలంటే స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. ఇందుకోసం అవసరమైన కేబుల్‌ను సముద్ర గర్భం నుంచి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.