జైపూర్, ఏప్రిల్ 28: ఎంతో బాధ్యతాయుతంగా విద్యార్ధుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ ప్రభుత్వ టీచర్.. ఉపాధ్యాయ వృత్తికే కలకలం తెచ్చాడు. ఎంతో శ్రద్ధగా పరీక్ష రాస్తున్న విద్యార్థి పరీక్ష మధ్యలో ఆపేసి.. కోడిని తీసుకువచ్చి దానిని శుభ్రం చేసి ముక్కలు కొట్టాలని పురమాయించాడు. దీంతో చేసేదిలేక ఆ స్టూడెంట్‌తో కోడి కోసి, స్కిన్ తీసి, ముక్కలుగా కట్ చేయగా.. సదరు టీచర్ వండేందుకు ఆ కోడి మాంసాన్ని ఇంటికి పంపించాడు. ఈ విషయం గ్రామంలోని జనాలకు తెలియడంతో వారు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
కొటాడ ప్రాంతంలోని ప్రభుత్వ బడిలో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. 9వ తరగతి విద్యార్థి రాహుల్ కుమార్ పరీక్ష రాస్తుండగా టీచర్ మోహన్‌లాల్ దోడా మధ్యలో విద్యార్ధిని పిలిచాడు. అతడు పరీక్ష రాయడాన్ని మధ్యలోనే ఆపించిమరీ.. ఆ స్టూడెంట్ చేత కోడిని కోయించి, దాని స్కీన్ తీసి ముక్కలుగా కట్ చేయించి, వంట చేసేందుకు తన ఇంటికి పంపించాడు. ఆ ఊరి జనాలకు ఈ విషయం తెలియడంతో టీచర్ మోహన్‌లాల్ ప్రవర్తనపై మంత్రి బాబులాల్ ఖరారీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని మంత్రి సబ్-డివిజనల్ అధికారి హస్ముఖ్ కుమార్‌ను ఆదేశించారు.
మరోవైపు సదరు స్కూల్ టీచర్ మోహన్‌లాల్ నెల కిందట స్కూల్ వంట మనిషిని కూడా తొలగించాడు. నాటి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. అలాగే విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. సబ్-డివిజనల్ ఆఫీసర్ విచారణ నివేదికలో మోహన్ లాల్ దోడా పాఠశాలలో పరీక్ష సమయంలో 9వ తరగతి విద్యార్థి రాహుల్ కుమార్ పార్గిని కోసి, చర్మం కోసి, శుభ్రం చేయించాడని తేలడంతో ఆ మేరకు నివేదిక సమర్పించాడు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.