చందనోత్సవానికి సింహాచలం సిద్ధమైంది. ఏప్రిల్ 30వ తేదీ చందనోత్సవం, అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తనున్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో సింహాచలం దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు సాఫీగా అప్పన్న దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎండ వేడిమి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాలు, మజ్జిగ, బిస్కెట్లు, అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

దివ్యాంగులు, వృద్ధులతో పాటుగా ఏడాదిలోపు వయసు ఉన్న చంటి పిల్లల తల్లులకు లిఫ్టు ద్వారా దర్శనం కల్పించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఉదయం ఆరు గంటలకే వీఐపీల అంతరాలయ దర్శనం ముగించనున్నారు. ఆరు గంటల తర్వాత అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చే ప్రముఖులు నీలాద్రి ద్వారం వద్ద నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలం, ఎండ వేడిమి నేపథ్యంలో క్యూలైన్లలోని భక్తుల కోసం ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు పాలు, మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.
మరోవైపు సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం, చందనోత్సవం టికెట్లు ఇప్పటికే విక్రయిస్తు్న్నారు. ఆఫ్ లైన్‌తో పాటుగా ఆన్‌లైన్‌లోనూ టికెట్లు విక్రయిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయాలను సింహాచలం దేవస్థానం ప్రారంభించింది. ఆన్లైన్లో ఏప్రిల్ 29 వరకూ సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. రూ.300, రూ.1000లకు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 29వ తేదీ తర్వాత టికెట్ల విక్రయాలు నిలిపివేయనున్నారు. సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం టికెట్లను సింహగిరిపై పాత పీఆర్వో కార్యాలయం వద్ద, సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు శాఖల్లో, అక్కయ్యపాలెం, మహారాణిపేట యూనియన్ బ్యాంకులలోనూ , బిర్లా కూడలి, సాలిగ్రామపురంలోని స్టేట్ బ్యాంక్‌లోనూ అందుబాటులో ఉంచారు.