
ఏప్రిల్ 20 సాయంత్రం హేమరాజ్ దంపతులకు వారు తినే ఆహారంలో ద్రవరూపంలో ఉన్న మత్తుమందును కలిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అది తిన్న కొద్దిసేపటికే దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. వెంటనే అప్రమత్తమైన నిందితులు ఇంట్లో బీరువాలో దాచి ఉన్న సుమారు 50 లక్షల నగదు, కిలో బరువున్న బంగారం ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం హేమరాజ్‌కు చెందిన కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు. సోమవారం ఉదయం రోజుమారీగా వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఆయన స్నేహితులకు ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా హేమరాజ్ ఆయన భార్య స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు ఖాజీగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారైన కారును సంతోష్‌నగర్ ప్రాంతంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న నేపాల్‌కు చెందిన ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నగరం విడిచి వెళ్ళకుండా అన్ని మార్గాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.