సివిల్స్ కొట్టాలంటే పేరున్న సంస్థల్లో ట్రైనింగ్ అవసరం లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివామనే బెంగ అసలే అవసరం లేదు.. కావాల్సిందల్లా గుండెల్లో సంకల్పం, చేతల్లో చూపడమే.. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంత పెద్ద కల అయినా నెరవేరాల్సిందే, మన ఒళ్లో వాలాల్సిందే అని నిరూపించారు.. ఉదయ్‌కృష్ణారెడ్డి.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి సక్సెస్ స్టోరీ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సీఎం చంద్రబాబుతో ప్రశంసలు అందుకునేలా చేసింది.

సీఐ చేతిలో అవమానం.. ఐపీఎస్ కొట్టేలా చేసింది..
ఆ యువకుడి జీవితంలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎంతో సంతోషంగా 2013లో కానిస్టేబుల్ ఉద్యోగం ప్రారంభించాడు. కానీ పక్కోడు ఎదుగుతుంటే ఓర్చుకోలేని లోకమిది. అలా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఓ సీఐ.. అతని పాలిట విలన్‌గా మారాడు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానించడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలను గుర్తుచేసుకుని సీఐ వేధింపులను భరిస్తూ వచ్చాడు తను. కానీ ఓ రోజు అనుకోని ఘటన జరిగింది. 60 మంది పోలీసుల ముందు సీఐ చేతిలో అవమానం.. దీంతో భరించలేకపోయాడు. ఆత్మగౌరవం దెబ్బతింది.. ఆకలితో అయినా ఉండగలం కానీ, ఆత్మగౌరవం లేకుండా ఉండలేమని భావించాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ఆ రోజే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని.. ఆవేశంలో తీసుకున్న ఆ నిర్ణయమే తన రాతను మారుస్తుందని ఊహించలేకపోయాడు.
అవమానం తాలూకూ పెంచిన కసితో సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాడు. ఒకటోసారి.. తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తప్పింది.. పర్లేదులే అనుకున్నాడు, రెండోసారి ప్రిలిమ్స్‌లోనే తప్పింది.. భయం మొదలైంది.. ఉన్న ఉద్యోగాన్ని వదిలేశా, కష్టపడి చదివితే ఫలితాలు తారుమారు అవుతున్నాయనే బెంగ మొదలైంది. మూడోసారి అంతే.. ప్చ్ నిరాశే ఎదురైంది.. తనలో భయం మరింత పెరిగింది. కానీ కొన్నిరోజులే.. ఈసారి బలంగా కొట్టాలని నిర్ణయించుకున్నాడు. కసిగా చదివాడు. నాలుగో ప్రయత్నంలో.. సివిల్స్‌లో సక్సెస్ అయ్యాడు. 780 ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వేస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఐదోసారి ఏకంగా ఐపీఎస్‍కు సెలెక్టయ్యాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇది.
సివిల్స్ సాధించాలంటే పెద్ద పాఠశాలల్లో చదవాలని.. పేరున్న సంస్థలలో శిక్షణ పొందాలని అపోహలకు చెక్ పెడుతూ.. ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ, లక్ష్యంపై ధ్యాస ఉంటే మారుమూల సర్కారీ బడుల్లో చదివి కూడా సివిల్స్ కొట్టొచ్చని నిరూపించాడు.. సింగరాయకొండ మండలం ఓలపాలెంకు చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డి. ఇటీవల వెల్లడైన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా లెవల్లో 350 ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ఎంచుకున్న కెరీర్ మీద అభిరుచి, లక్ష్యంపై శ్రద్ధ ఉంటే.. ఏ కలా పెద్దది కాదని నిరూపించాడు.
మరోవైపు ఉదయ్‌కృష్ణారెడ్డి విజయాన్ని అభినందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఆయన ప్రయాణం అభినందనీయమని కొనియాడారు. ధైర్యం, అవిశ్రాంత కృషి ఉంటే ఏ కల కూడా పెద్దది కాదని రుజువు చేశారని.. కష్టపడేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఉదయ్‌కృష్ణారెడ్డిని చంద్రబాబు అభినందించారు.