సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతిచెందిన ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నానని, వర్షాల కారణంగానే గోడ కూలినట్లు సమాచారం అందిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
మరోవైపు, ప్రమాదానికి కారణమైన గోడకు ఇరువైపులా అధికారులు ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన సమయంలో గోడ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు నేరుగా భక్తులపై పడకుండా ఆ ఫెన్సింగ్ అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అది లేకపోయినట్లయితే పెను ప్రమాదం జరిగి మృతుల సంఖ్య భారీగా పెరిగేదని సమాచారం.
అటు సింహాచలం ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అప్పన్న ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం వారి వెంటే ఉందని లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..