మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు కారణంగా చాలా మంది రోజూ జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఉదాహరణకు అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యలను సహజంగా నివారించాలంటే ఆహారంలో తగిన ఫైబర్, పోషకాలు ఉన్న కూరగాయలు తప్పకుండ ఉండాలి. ఇక్కడ అటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన 10 కూరగాయలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలీఫ్లవర్
ఈ తెల్లటి కూరగాయలో తేమ శాతం అధికంగా ఉండటమే కాకుండా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కడుపులో ఏర్పడే అసిడిటీకి కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలోనూ జీర్ణక్రియను సాఫీగా జరిగేలా చేయడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
కాలే ఆకులు
ఇటీవలి కాలంలో మనదేశంలో కాలే అనే ఆకుకూర ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె, బీటా కెరోటిన్ వంటి కీలక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో విషతత్వాలను తొలగించడంలో సహాయపడతాయి. కాలేలో పేగుల ఆరోగ్యానికి మేలు చేసే అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
పచ్చి బఠానీలు
ఒక కప్పు పచ్చి బఠానీలు దాదాపు 7 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. పైగా వీటిలో ఉండే పోషకాల వల్ల శరీరానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది.
చిలగడదుంపలు
ఈ దుంపల్లో రెండు రకాల ఫైబర్లు ఉంటాయి.. అవి ప్రేగుల కదలికను క్రమబద్ధంగా ఉంచే విధంగా పని చేస్తాయి. చిలగడదుంపల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియకు మేలు చేసి ఆరోగ్యకరమైన పేగు చర్యలను ప్రోత్సహిస్తాయి.
పాలకూర
పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మలబద్ధక సమస్యను తగ్గించేందుకు పాలకూరను తరచూ ఆహారంలో చేర్చడం మంచిది.
క్యారెట్లు
క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్ కె, బీ6, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడతాయి. క్యారెట్ తినడం వల్ల ప్రేగుల కదలిక నియమితంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
బీట్రూట్
బీట్రూట్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ. ఇది పేగుల కదలికను సవ్యంగా నిర్వహించడంలో సహకరిస్తుంది. జీర్ణక్రియ మెరుగవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీ క్రూసిఫరస్ కూరగాయల కుటుంబానికి చెందినది. ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది.
బ్రస్సెల్స్ మొలకలు
ఇవి చిన్న మొలకల రూపంలో ఉండటం మాత్రమే కాదు.. జీర్ణక్రియను మెరుగుపర్చే పోషకాలతో నిండి ఉంటాయి. మలబద్ధకం, వాయువు సమస్యలు, కడుపులో వాపును తగ్గించడంలో బ్రస్సెల్స్ మొలకలు ప్రభావవంతంగా పని చేస్తాయి.
ఆర్టిచోక్స్
ఇవి మన దేశంలో అంతగా కనిపించకపోయినా.. ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి. ఆర్టిచోక్స్‌లో అధికంగా ఉండే ఫైబర్, జీర్ణక్రియను మెరుగుపరిచే విధంగా పని చేస్తుంది. ప్రేగుల కదలికను నియంత్రించడం ద్వారా మలబద్ధకాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది.
ఇలాంటి సహజమైన కూరగాయలను మన రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుంచి బయట పడవచ్చు. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే ఈ పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. పేగుల పని తీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని జీర్ణం చేసే శక్తిని పెంచే ఈ రకమైన కూరగాయలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.